వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన పై నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర నిఘా సంస్థ కూడా ఆరా తీసినట్లు సమాచారం. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అనర్హత వేటు వేసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఫోర్జరీ పత్రాలు సృష్టించి తనపై అనవసర ఆరోపణలు చేశారని, తన పరువుకు నష్టం కలిగించారని ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించనున్నారు. ఈనేపథ్యంలో కాకాణిపై పోలీసుకేసు నమోదు కావడంతో ఈ విషయం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు సోమిరెడ్డి. స్పీకర్ ను కలిసి ఫోర్జరీ పత్రాలను సృష్టించి కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్యే కాకాణిపై అనర్హత వేటు వేయాలని సోమిరెడ్డి కోరనున్నారు.
అనర్హత వేటు వేయాలని.....
మంత్రి సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డిపై సర్వే పల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సోమిరెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు విదేశాల్లో పెద్దయెత్తున ఆస్తులు కూడబెట్టారని, దాదాపు వెయ్యికోట్లకు పైగానే సోమిరెడ్డి సంపాదించారని కాకాణి ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ కాకాణి మీడియా సమావేశంలో బయటపెట్టారు. ఆ పత్రాలను పోలీసులకూ అందించారు. అయితే చివరకు అవి ఫోర్జరీవనితేలింది. కాకాణి ఒక బ్రోకర్ మాటలను నమ్మి సోమిరెడ్డిపై అనవసర నిందలు వేశారని పోలీసులు కూడా తేల్చారు. ఈ కేసును మంత్రి సోమిరెడ్డి సీరియస్ గానే తీసుకున్నారు.గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ వివాదం నడుస్తోంది. ఈ ఫోర్జరీ కేసులో ఎమ్మెల్యే కాకాణిని ఏ 1 నిందితుడిగా పోలీసులు చేర్చారు. సోమిరెడ్డి ఇంతటితో ఆగకుండా తనపై కాకాణి చేసిన ఆరోపణలకు సంబంధించి కేంద్ర నిఘావిభాగం, విదేశీ వ్యవహారాలశాఖకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విభాగాలు కూడా కాకాణిని ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మలేషియా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ పత్రాలను కూడా కాకాణి నమ్మిన ముఠా ఫోర్జరీ చేసింది. అలాగే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరిట ప్రత్యేకంగా పాస్ పోర్ట్ కూడా తయారు చేశారు. వీటిని కేంద్ర నిఘా విభాగం, విదేశీ వ్యవహారాల శాఖ సీరియస్ గా తీసుకుంది. దీంతో ఈ రెండు విభాగాలు కూడా కాకాణిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కేసులన్నీ బలంగా ఉండటంతో కాకాణిపై అనర్హత వేటు వేయించాలన్నది సోమిరెడ్డి వ్యూహంగా కన్పిస్తోంది. మరి కాకాణిపై అనర్హత వేటు పడనుందా? లేదా? చూడాలి మరి.