వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవా?

Update: 2017-11-01 01:30 GMT

వైసీపీ ప్రస్తుత శాసనసభ్యులపై అనర్హత వేటు పడుతుందా? సాంకేతిక కారణాలతో చూస్తే అవుననే అనిపిస్తోంది. తమపార్టీ గుర్తు మీద గెలిచి టీడీపీలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయకుంటే తాము శాసనసభలోకి అడుగుపెట్టబోమని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ 20 మంది సంగతేమో కాని... ప్రస్తుతం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న శాసనసభ్యులందరిపై వేటు పడే ప్రమాదముందంటున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అదే సమయంలో వచ్చే నెల 10 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ఆరు నెలల తర్వాత జరగనున్నాయి.

బిందాస్ గా ఎమ్మెల్యేలు....

ఎవరైనా శాసనసభ్యుడు ఆరు నెలలు వరుసగా శాసనసభకు హాజరుకాకుంటే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ ఏడాది మే నెలలో జరిగాయి. ఆరు నెలల్లోగా అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉండటంతో స్పీకర్ కోడెల ఈ నెల 10వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తాము రావడం కుదరదంటున్నారు. 20 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే గాని రామంటున్నారు. అయితే ఆరు నెలల్లోపు శాసనసభకు హాజరు కాకుంటే ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసే అవకాశముందని, వారిపై చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ లోచెబుతున్నారు. ఎవరైనా సభ్యులు సభకు హాజరు కాలేకపోతే ముందుగానే స్పీకర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి వైసీపీ సభ్యులు ఏం చేస్తారు? వారు మాత్రం బిందాస్ గా ఉన్నారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయని స్పీకర్ తమపై ఎలా చర్య తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అదే జరిగితే ఆ పార్టీ ఆంధ్రాలో కోలుకోలేదని కూడా చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరైతే వేటు వేస్తారన్న టాక్ ఏపీలో బలంగా విన్పిస్తోంది.

Similar News