వైసీపీ ఎమ్మెల్యే పై గురి పెట్టారా?

Update: 2018-03-07 07:30 GMT

వైసీపీ ఎమ్మెల్యేలను రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని ప్రభుత్వం కుట్రచేస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి ఇప్పటికే టీడీపీ నేతలు బేరసారాలు ప్రారంభించారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. టీజీ వెంకటేశ్, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులతో పాటు ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్రవంటి వారు కూడా ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈవిషయాన్ని రాష్ట్రపతితో పాటు ఎన్నికల కమిషన్ కు కూడా విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు.

కోటంరెడ్డికి నోటీసులు.....

అయితే తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేవారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు పంపారు. రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకే తమ ఎమ్మెల్యేకు నోటీసులు పంపారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తాను రాజ్యసభ నామినేషన్లతో పాటు వివిధ కార్యక్రమాలు ఉన్నందున తాను విచారణకు హాజరుకాలేనని పోలీసులకు వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణకు పోలీసులు సంతృప్తి చెందుతారా? లేదా? అన్నది చూడాలి.

గతంలో విచారించిన పోలీసులు....

క్రికెట్ బెట్టింగ్ కేసులో గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను విచారణకు పిలిచారు. ఇద్దరూ విచారణకు హాజరై తమ వివరణ ఇచ్చి వచ్చారు. క్రికెట్ బెట్టింగ్ ముఠా వద్ద తమ ఫోన్ నెంబర్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారని, తమ ఫోన్ నెంబర్లు ఎంత మంది వద్దో ఉంటాయని, తాము ఎమ్మెల్యేలం కాబట్టి నియోజకవర్గానికి చెందిన ఎందరో తమకు ఫోన్లు చేస్తుంటారని వారు చెబుతున్నారు. కేవలం తమను టార్గెట్ చేయడానికే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులు, మంత్రుల అనుచరులు ఉంటే తమనే లక్ష్యంగా చేసుకున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల వేళ కోటంరెడ్డికి నోటీసులు పంపడం నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Similar News