కర్నూలు జిల్లా వైసీపీ పార్లమెంటు సభ్యురాలు బుట్టారేణుక టీడీపీీలో చేరిపోయారు. ఈరోజు ఉదయం 9గంటలకు చంద్రబాబును కలిసి తన రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా బుట్టా రేణుక గెలిచారు. అయితే వైసీపీలో ఆమె గత కొంత కాలంగా ఇమడలేకపోతున్నారు. దీంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తొలుత సోమవారమే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న రేణుక... చంద్రబాబు అపాయింట్ మెంట్ లభించకపోవడంతో ఈరోజు పార్టీలో చేరారు. అసలు రేణుక దీపావళి తర్వాత పార్టీలో చేరతానని టీడీపీ అధిష్టానానికి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళుతుండటంతో... ఆలస్యమవుతుందని వెంటనే చేరాలని టీడీపీ రాష్ట్ర పార్టీ రేణుకపై వత్తిడి తెచ్చింది. దీంతో కొద్దిసేపటి క్రితం ఆమె టీడీపీలో చేరారు.
రేణుకపై సస్పెన్షన్ వేటు......
బీసీ కులానికి చెందిన రేణుకను వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది. గత కొద్ది రోజులుగా రేణుక పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో వైసీపీ అధినేత జగన్ రేణుకను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రేణుకకు తాము అత్యంత ప్రాధాన్యత ఇచ్చినా.. ప్రలోభాలకు లొంగి టీడీపీలోకి వెళుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజాసమస్యలపై పోరాడాల్సిన రేణుక, ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా పార్టీని వీడటం ఓటేసిన ప్రజలను అవమానిండమేనంటున్నారు. రేణుకతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్ రెడ్డి కూడా రేణుక వెంట టీడీపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటుపై స్పష్టత ఇవ్వకపోవడం వల్లనే రేణుక పార్టీ మారారని రేణుక అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ పాదయాత్రకు ముందే వైసీపీకి రేణుక షాకిచ్చినట్లయింది.