కర్నూలు ఎంపీ బుట్టా రేణుక నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం నేడు నిజం కానుంది. వైసీపీ తరుపున కర్నూలు ఎంపీ బుట్టా రేణుక గత మూడున్నరేళ్లుగా పార్టీలో ఉన్నా అంటీముట్టనట్లే ఉన్నారు. వైసీపీని ఎప్పుడు వీడాలా? అన్న మీమాసంలో ఇప్పటి వరకూ ఉన్నారు. అయితే తెలుగుదేశం అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆమె ఈరోజు పార్టీలో చేరనుంది. వైసీపీని వీడు పసుపు కండువా కప్పుకోనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రేణుకకు అనేక వ్యాపారాలున్నాయి. విద్యాసంస్థలున్నాయి. ఆమె తొలిసారి కర్నూలు ఎంపీగా విజయం సాధించారు.
కర్నూలు ఎంపీ టిక్కెట్ పై హామీ.....
అయితే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటే బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరాల్సి ఉంది. కాని ఆమె మనసు మార్చుకుని కొనసాగారు. అరకు ఎంపీ కొత్త పల్లి గీత కూడా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే బాటలో ఇప్పటి వరకూ రేణుక కూడా నడిచారు. కాని ఇంకా ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడం, వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టిక్కెట్ ను రేణుకకే ఇస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో రేణుక ఈరోజు వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రేణుక పార్టీలో చేరడం తమకు కలిసొచ్చే అంశమని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.