ఏపీలో 22 మంది వైసిపి ఎమ్యెల్యేలు ఇప్పటివరకు టిడిపి కండువా కప్పుకున్నారు. వీరంతా పార్టీ ఎందుకు మారారు అంటే మొదట్లో అధినేత వైఖరి పై విమర్శలు గుప్పించేవారు. తరువాత నియోజకవర్గం అభి "వృద్ధి " కోసం జంప్ అయ్యామని చెప్పడం మొదలు పెట్టారు. ఇప్పుడు సీన్ మార్చారు. వైసిపి బహిష్కరణ అస్త్రంతో అసెంబ్లీని మిస్ అవుతున్నామని దీనివల్ల ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కోల్పోతున్నందునే పార్టీ మారుతున్నామని కొత్త స్లోగన్ ఇస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా వంతల రాజేశ్వరి అదే మాట చెప్పడం, దానికి టిడిపి నేత వర్లరామయ్య వంతపాడటం గమనార్హం.
మరికొందరికి వలవిసిరారా...?
జగన్ పాదయాత్ర ను బలహీనపర్చడానికి టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ ను పెద్దఎత్తునే చేయడానికి సంకల్పించినట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో భాగంగా ఒక సీరియల్ గా ఎమ్యెల్యేలను అభివృద్ధి అసెంబ్లీ బహిష్కరణ పేరుతో విపక్షం నుంచి అధికార పక్షంలోకి లాక్కు వచ్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధమైంది. ఇది విజయవంతం కావడానికి సెంటిమెంట్ గా తూర్పు గోదావరి జిల్లా నుంచి టిడిపి ప్రారంభించింది. వైసిపి ఎమ్యెల్యేలు ఒక్కొక్కరు వచ్చేలా అయితే మానసికంగా జగన్ ను బలహీనపర్చడం ప్రజల్లో కూడా ఆ పార్టీ ఇమేజ్ ను తగ్గించే ఎత్తుగడను అధికారపార్టీ అనుసరిస్తుంది. మరి వైసిపి తమ ఎమ్యెల్యేలను ఎలా కాపాడుకుంటుందో చూడాలి.