అటకెక్కిన పోలవరాన్ని భువికి తెచ్చిన నేత ఆయన. రెండుసార్లు సింగల్ హ్యాండ్ తో అవిభక్త ఆంధ్రప్రదేశ్ కి అధికారం కట్టబెట్టారు. ఆయన మరణించినా ప్రత్యర్ధులు తలవని రోజు లేకుండా ఇప్పటికి రాజకీయాలు సాగేలా చేశారు. పేదల పక్షపాతిగా సంక్షేమ పథకాలతో పేరు తెచ్చుకున్నారు. అంతటి నాయకుడు బొమ్మ లేకుండా అత్యంత ప్రాధాన్యత గల కార్యక్రమాన్ని పూర్తి చేసేసింది ఏపీ కాంగ్రెస్. పోనీ ఆ కార్యక్రమాల్లో ఆయన స్మరణ లేకుండా సాగిందా అంటే కధ మొత్తం ఆయన చుట్టూనే నడిచింది. ఆయనే వైఎస్ రాజశేఖర రెడ్డి. రెండు సార్లు కాంగ్రెస్ సీఎం గా గెలిచిన వైఎస్సాఆర్ బొమ్మలేకుండా ఆయన మానసపుత్రిక పోలవరం ప్రాజెక్ట్ కోసం కాంగ్రెస్ నిర్వహించిన మహా పాదయాత్ర లో ఈ వింత చోటు చేసుకోవడం చర్చనీయాంశం.
వైఎస్ కుమారుడు పార్టీ పెట్టారనే ...?
వైఎస్ మరణం తరువాత ఆయన కుమారుడు కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి తనతండ్రి పేరు వచ్చేలా వైఎస్సాఆర్ పార్టీ స్థాపించడం వల్లే ఆయన బొమ్మను కాంగ్రెస్ వినియోగించడం తగ్గిస్తూ వచ్చింది. కానీ ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా ఆయన జ్ఞాపకాలు, సంక్షేమ కార్యక్రమాలు, పోరాట పటిమా నేతలు ప్రస్తావించకుండా కార్యక్రమాన్ని ముగించారు. ఇది సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలను అంతర్మధనానికి గురిచేస్తుంది. వైఎస్ బతికినంత కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారన్న సంగతి తమ పార్టీ విస్మరిస్తే ఎలా అన్నది వారి వేదన.
పోలవరం సత్యాగ్రహ సభలో వైఎస్ ఆత్మ సమక్షంలోనే ......
స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆత్మగా అంతా పిలుచుకునే రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రధాన ఆకర్షణగా పోలవరం మహా పాదయాత్ర కాంగ్రెస్ ప్లాన్ చేసింది. వయస్సు మీరినప్పటికీ కెవిపి తన సతీమణి తో సహా పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్ కి అత్యంత ఆప్తులైన పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి వట్టి వసంత్ వంటి వారు సత్యాగ్రహ సభలో పాల్గొన్నా అక్కడ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన ఏ ఒక్క ఫ్లెక్సీ పై వైఎస్ బొమ్మ ఎందుకు లేదని ఏర్పాట్లు చేసిన వారిని నిలదీయకపోవడం కార్యకర్తల్లో చర్చకు దారితీసింది.
జగన్ వైఎస్ చరిష్మా లాగేశారనే ...?
వైసిపి అధినేత జగన్ పార్టీ పెట్టక ముందు ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తనతండ్రి వైఎస్సాఆర్ విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా ప్రతి ఊరిలో ఉండేలా నెలకొల్పేశారు. ఆ తరువాత ఆయన పార్టీ పెట్టడం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా వుండే ఓటు బ్యాంక్ వైసిపి వైపు టర్న్ కావడం జరిగిపోయాయి. ఇక ఆ ఎన్నికల్లో విభజన కోపంతో జనం కాంగ్రెస్ కు ఒక్కసీటు రాకుండా చేసి వైసిపి ని అధికారానికి దాదాపు దగ్గర చేశారు. ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ అధిష్టానం మీద తీవ్రంగా పడింది. కాంగ్రెస్ వైపు నుంచి వైఎస్ ప్రస్తావన పేరుకు చేస్తున్నా ఆయన బొమ్మలు కనుమరుగు అవుతూ వస్తున్నాయి. తాజాగా కూడా అదే జరిగింది.