వైఎస్ కాళ్లు పట్టుకుంది చంద్రబాబే: ముద్రగడ

Update: 2017-02-06 02:23 GMT

బావమరిది బాలకృష్ణ కాల్పుల కేసులో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాళ్ళు పట్టుకుని సాయం అర్ధించింది చంద్రబాబేనని, ఉద్యమం కోసం జగన్‌ సాయం పొందాల్సిన అవసరం తనకు లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో వైసీపీ నేత దుట్టారామచంద్రరావు, కాంగ్రెస్‌ నేత చలమలశెట్టి రమేష్ బాబు గృహాల్లో కాపునేతలతో ముద్రగడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో ముద్రగడ మాట్లాడుతూ కాపు ఉద్యమం వెనుక జగన్‌ హస్తం ఉన్నదని మంత్రులు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాల్పుల కేసులో బావమరిది బాలకృష్ణను కాపాడేందుకు ఆనాడు చంద్రబాబు అర్ధరాత్రి నంబర్‌ లేని కారులో సెక్యూరిటీ కూడా లేకుండా అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి వద్దకు వెళ్ళి కాళ్ళు పట్టుకుని కేసు నుంచి బయటపడేయాలని చంద్రబాబు ప్రాధేయపడ్డారన్నారు. ఈనెల 13న మంజునాథ కమిటీ పర్యటన ముగిసిన అనంతరం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జ్యోతిబసు తరువాత ముఖ్య మంత్రిగా అంతటి అపార అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబేనని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Similar News