ఇంతకూ రామకృష్ణ అలియాస్ ఆర్కే ఎక్కడ? ఎటు వెళ్లారు? పారిపోయి ఉంటే ఇంతవరకూ స్పందించకుండా ఉంటారా? కనీసం ప్రకటన విడుదల చేయకుండా ఉంటారా? లేదా గాయపడి పారిపోయి చికిత్స పొందుతూ ఉన్నారా? తన పేరిట ప్రకటన విడుదల అయ్యే పరిస్థితిలో కూడా లేరా? లేదా ఇంకా అడవుల్లోనే దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారా? ఇవన్నీ ఇప్పుడు సంచలనాంశాలుగా ఉన్నాయి. చర్చ వీటి చుట్టూ నడుస్తోంది.
ఒకవైపు మావోయిస్టు సానుభూతి పరులు ఆర్కేను పోలీసులు నిర్బంధించారని చెబుతున్నారు. ఆర్కేను తక్షణం కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటూ హెచ్చరిస్తున్నారు. అయితే అదే సమయంలో పోలీసులు ఆర్కే పారిపోయాడంటూ ఆయనకోసం కొత్తగా వెతకులాట మొదలెట్టడం విశేషం.
ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నాడంటూ సానుభూతి పరులు ఆరోపణలు చేయడం ప్రారంభించిన తర్వాత.. పోలీసులు ఆర్కే కోసం వెతకులాట ప్రారంభించడం చూస్తే యాదృచ్ఛికం కాదేమో అనిపిస్తోంది. జనంలో రకరకాల అనుమానాలు రేగుతున్నాయి. పోలీసులు శుక్రవారం నాడు ఆర్కే కోసం మల్కన్ గిరి అడవుల్లో హెలికాప్టర్ల ద్వారా ముమ్మరంగా వెతకడం ప్రారంభించారు. చూడబోతే ఆర్కే కు సంబంధించి.. మరికొన్ని సంచలన వార్తలు త్వరలో వెలుగులోకి వస్తాయని అనిపిస్తోంది.