వేమిరెడ్డి జాక్ పాట్ కొట్టినట్లే

Update: 2018-03-13 11:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో వైసీపీ రాజ్యసభ అభ్యర్థి వేమిరెడ్డి సతీమణి నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో మూడు స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరిక నెరవేరింది. గత కొన్నేళ్లుగా ప్రజాసేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెద్దల సభలో అడుగుపెట్టేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. చివరకు ఆయన కోరికను వైసీపీ అధినేత జగన్ తీర్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా చూసుకుంటే టీడీపీకి రెండు, వైసీపీకి ఒక స్థానం వస్తాయి. అయితే మూడో అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదనను టీడీపీ విరమించుకోవడంతో టీడీపీ అభ్యర్థులు సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర, వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే.

గతంలోనే రావాల్సి ఉండగా.....

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిది నెల్లూరు జిల్లా. ఆయన గత కొన్నాళ్లుగా నెల్లూరు జిల్లాలో ప్రజాసమస్యలపై దృష్టిపెట్టారు. వీపీఆర్ ట్రస్ట్ ద్వారా నెల్లూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గతంలోనే రాజ్యసభ సీటు దక్కాల్సింది. అయితే విజయసాయిరెడ్డి కారణంగా ఆయనకు రాలేదు. వేమిరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. 2014 ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థుల విజయానికి ఆయన ఎంతో శ్రమించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయనకు అప్పట్లో రాజ్యసభ సీటు దక్కలేదు.

పెరిగిన వైసీపీ బలం....

దీంతో వేమిరెడ్డి టీడీపీకి దగ్గరయ్యారు. వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీలో చేరితే సీటు దక్కదని భావించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా ఆయన వైసీపీలో జగన్ సమక్షంలో చేరారు. ఆయన చేరిన నాలుగు రోజులుకే జగన్ తమ పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రకటించారు. వేమిరెడ్డిని పార్టీలోకి చేర్చుకుంటే ఆర్థికంగా, సామాజిక పరంగా ఉపయోగపడతారని భావించిన వైసీపీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. వేమిరెడ్డి చేరికతో నెల్లూరు జిల్లాలో వైసీపీ బలం మరింత పెరుగుతుందని భావించిన వైసీపీ ఆయన అడిగినంతనే పెద్దల సభకు పంపించే ఏర్పాట్లు చేసింది. మొత్తం మీద వేమిరెడ్డి సునాయాసంగా రాజ్యసభకు వెళ్లనున్నారు. రాజ్యసభలో వైసీపీకి మరో గొంతుకు లభించింది.

Similar News