దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళకు పెరోల్ మంజూరయింది. ఐదు రోజుల పాటు శశికళకు పెరోల్ మంజూరు చేస్తూ కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఐదు రోజులు ఎవరినీ కలవకూడదని, బంధువుల ఇంట్లోనే ఉండాలని, ఎటువంటి రాజకీయ చర్చలు జరపరాదని షరతులు విధించింది. దీంతో శశికళ తన భర్త నటరాజన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో గాని, తన వదిన ఇళవరసి కూతురు ఇంట్లో గాని ఉండే వీలుంది. వేద నిలయానికి వెళ్లే ఛాన్స్ శశికళకు లేదు. వేదనిలయంలో శశికళ దాదాపు మూడు దశాబ్బాల నుంచి ఉండేవారు. జయలలితకు అత్యంత నమ్మకస్థురాలిగా ఉన్న శశికళ వేదనిలయంలో మన్నార్ గుడి మాఫియాను ఉద్యోగులుగా దింపేశారు.
పళని, పన్నీర్ అప్రమత్తం.....
చివరకు ఎనిమిది నెలల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళుతున్నప్పుడు కూడా శశికళ వేదనిలయం నుంచే వెళ్లారు. ఇప్పుడు పెరోల్ పై జైలు నుంచి వచ్చే సరికి పరస్థితులు మారిపోయాయి. వేదనిలయాన్ని జయ స్మారక మందిరంగా మార్చారు. ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. వేదనిలయంలోకి ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. మరోవైపు ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం అప్రమత్తమయ్యారు. శశికళ ఉండే ఐదురోజుల పాటు ఎమ్మెల్యేలు ఎవరూ ఆమెను కలవకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించినట్లు తెలిసింది. శశికళ భర్త నటరాజన్ కు కిడ్నీ, ,లివర్ ఫెయిల్ కావడంతో ఆయనకు ఆపరేషన్ చేశారు. ఆసుపత్రిలోనే నటరాజన్ కొద్ది రోజులుపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంది. దీంతో శశికళ ఆసుపత్రిలోనే ఉంటారా? మరెక్కడ ఉంటారన్నది తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.