జనసేనాని రాజకీయాల్లో మరింత దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశంతో ఏపీ పాలిటిక్స్ లో వేడి పుట్టించిన పవన్ తాను సొంతంగా పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఏపీలో అనంతపురం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ ఈ నెల 21వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మత్స్యకారులను కలిసి వారి ఆందోళనకు సంఘీభావం ప్రకటించనున్నారు. ఏపీలో ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో చిచ్చుపెట్టిందని పవన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుందంటున్నారు.
ప్లీనరీకి ఏర్పాట్లు.....
ఇక మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భవ తేదీ. ఆరోజు పెద్దయెత్తున కార్యక్రమాలు చేపట్టాలని పవన్ భావిస్తున్నారు. జనసేన ఆవిర్భవించి మార్చి 14వ తేదీతో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలందరినీ ఒకచోట చేర్చాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏపీ, తెలంగాణల్లోని అన్ని జిల్లాల్లో జనసైనికుల ఎంపిక పూర్తయింది. వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో జనసైనికులందరినీ సమీకరించాలని పవన్ భావిస్తున్నారు. శిక్షణ పొందిన కార్యకర్తలు ఇప్పటికే నియోజకవర్గాల్లో సమస్యలను అవగాహనకు తెచ్చుకుంటున్నారు. వారి నుంచి నియోజకవర్గాల వారీగా సమస్యలను తెలుసుకోనున్నారు పవన్.
గుంటూరులో భారీ బహిరంగ సభ.....
ఇక జనసేన ఆవిర్భవించిన మార్చి 14వ తేదీన గుంటూరులో భారీ బహిరంగ సభ పెట్టాలని భావిస్తున్నారు. ఈ సభ నుంచే 2019 ఎన్నికల సమర శంఖారావం పూరించాలన్నది పవన్ ఆలోచనగా ఉంది. జనసేన పార్టీ ఐదో వార్షిక వేడుకలను గుంటూరులో జరపనున్నారు. నాగార్జున యూనివర్సిటీని వేదికగా నిర్ణయించారు. ఇప్పటికే జనసేన నేతలు కొందరు నాగార్జున యూనివర్సిటీని సందర్శించి స్థల పరిశీలన చేశారు. అయితే ఈలోపు పార్టీలో పదవులన్నింటీని భర్తీ చేయాలని కూడా పవన్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. పార్టీ ప్లీనరీలోపు జేఎఫ్ సి నివేదిక కూడా తుదిరూపు తీసుకుని, పార్టీ ఆందోళన బాట పట్టే అవకాశముంది. మొత్తం మీద జనసేనాని ఇక ప్రజాక్షేత్రంలోనే ఉండాలని, పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నారు.