అదేంటో కొందరు ఏం చేసినా.. అవి వివాదాలుగా మారుతుంటాయి. చూడబోతే మన తెలుగు రాజకీయ ప్రముఖుల విషయంలో వెంకయ్యనాయుడు పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుంది. అక్కడ కేంద్రంలో ఆయన చేతులారా ఇవ్వగలిగింది ఏమీ లేకపోయినా.. మోడీ చూపించిన రిక్తహస్తానికి బాధ్యుడిగా.. ప్రత్యేక హోదా తేలేకపోయారంటూ అందరూ వెంకయ్యనాయుడునే నిందించారు. ఆయన ఆ నిందలన్నీ భరించారు. వచ్చిన ప్యాకేజీలో రాష్ట్రానికి మేలు జరిగేలా నా పాట్లు నేను పడ్డానని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో.. ఆయన తమిళనాడులో అడుగుపెట్టిన తర్వాత.. గవర్నర్ విద్యాసాగర్ రావు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లినా కూడా రకరకాల వదంతులు వ్యాప్తిలోకి వచ్చేస్తున్నాయి.
తమిళనాడులో జయలలిత ఆరోగ్య పరిస్థితి చాలా రోజులుగా సవ్యంగా లేకపోవడం, తమిళనాడులో తక్షణం రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉన్నదంటూ భాజపాకే చెందిన ఆ రాష్ట్ర నాయకుడు సుబ్రమణ్యస్వామి లాంటి వారు డిమాండ్ చేయడం, మహారాష్ట్రలో ఉండాల్సిన ఇన్ ఛార్జి గవర్నర్ చెన్నయ్ లోనే తిష్టవేయడం.. ఇలాంటి కీలక పరిణామాల నేపథ్యంలో.. సోమవారం ఉదయం గవర్నర్ బంగళాకు వెంకయ్యనాయుడు అల్పాహార విందుకు రావడం వదంతులకు కారణమైంది.
రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం పావులు కదుపుతున్నదా? రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పరిస్థి తికి అవకాశం లేదా? అనే పుకార్లు అప్పుడే వ్యాప్తిలోకి వచ్చాయి. గవర్నర్ బంగళా నుంచి బయటకు రాగానే పాపం.. వెంకయ్యనాయుడు ఇదే విషయమై వాపోయారు. గవర్నర్ విద్యాసాగర్ రావు తనకు పాత సహచరుడని, కేవలం స్నేహపూర్వకంగా అల్పాహార విందుకు మాత్రమే వచ్చానని.. ఇలాంటి సమయంలో వదంతులను వ్యాప్తి చేయడం కరెక్టు పని కాదని హితవు చెప్పారు. ఏంటో.. వదంతులు, చికాకులు, చిరాకులు అన్నీ వెంకయ్యనే చుట్టుముడుతున్నాయ్.