గత ఐదు రోజులుగా పార్లమెంటులో ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలు కేంద్రం పట్టించుకోలేదు. దీంతో చివరి రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. ఏపీ ఎంపీల ఆందోళనలతో ఉభయ సభలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎంపీల ఆందోళనలకు మిగిలిన పార్టీలూ మద్దతు పలికాయి. తృణమూల్ కాంగ్రెస్, అకాలీదళ్, టీఆర్ఎస్ వంటి పార్టీలు ఏపీ ఎంపీల డిమాండ్ సరైనదేనని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చివరి రోజైనా ఆంధ్రప్రదేశ్ కు ఊరట కల్గించేలా ఒక ప్రకటన చేయిస్తే బాగుంటుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
షా, జైట్లీతో వెంకయ్య చర్చలు....
దీంతో ఆయన రాజ్యసభ వాయిదా పడిన అనంతరం పార్లమెంటులోని తన ఛాంబర్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అరుణ్ జైట్లీలతో సమావేశమయ్యారు. ఏపీకి చేయాల్సిన ఆర్థిక సాయం, హామీల అమలుపై వెంకయ్యనాయుడు సుదీర్ఘంగా వారితో చర్చించారు. అయితే ఈ చర్చల్లో పాల్గొన్న అమిత్ షా కూడా కొంత సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఏపీ డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించాలని, ప్రకటన రూపంలో చేస్తే బాగుంటుందని అమిత్ షా అరుణ్ జైట్లీకి సూచించారు.
కొన్ని డిమాండ్లకు ఓకే.....
అయితే దుగరాజుపట్నం పోర్టు వల్ల ప్రయోజనం లేదని నీతిఅయోగ్ నివేదిక ఇవ్వడం, భద్రత కారణాల దృష్ట్యా ఇస్రో అభ్యంతరాలు తెలపడంతో ఆ పోర్టు విషయాన్ని పక్కనపెట్టాలని ఇరువురూ భావించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా ఒడిషా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. మిగిలిన విషయాలపై అధికారులతో చర్చించి వారి డిమాండ్లను పరిష్కరించాలని అమిత్ షా జైట్లీకి సూచించినట్లు తెలిసింది. దీంతో ఏపీకి సానుకూలంగా త్వరలోనే ఒక ప్రకటనతో పాటు కొన్ని డిమాండ్లను నెరవేర్చాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వెంకయ్య జోక్యంతోనే కొంత కేంద్రలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది.