దేశానికి రాజయినా తల్లికి బిడ్డెగా. అదే క్లారిటీ ఇచ్చేశారు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు. నెలకోసారి మాతృభూమిని తాకందే మనసు భారం అవుతుందన్నారు ఆయన. ప్రపంచ తెలుగు మహా సభల్లో తొలిరోజు ముఖ్య అతిధి గా పాల్గొన్న వెంకయ్య తనపై ఇటీవల పెరిగిన విమర్శలకు సరైన వేదికపై నుంచే జవాబు చెప్పేశారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని తనదైన శైలిలో చాటి చెప్పిన వెంకయ్య అందరిని ఆకట్టుకునే తీరులో ప్రసంగించారు. మాతృ భాష ఉడత భాష కానీయకూడదని మాతృభాష మరిచిపోతే సంప్రదాయాలు, సంస్కృతి, మాట,బాట, అన్ని మారిపోయి మన అస్థిత్వాన్నే కోల్పోతామని హెచ్చరించారు వెంకయ్య.
అందుకే చెప్పారా ...?
భారత ఉపరాష్ట్రపతి హోదాలో ప్రోటోకాల్ ప్రకారం వెంకయ్య నాయుడు నడుచుకోవాలిసి వుంది. తెలుగు రాష్ట్రాలపై మమకారం తో ఆయన గతంలో ఎలా తెలంగాణ ఏపీ లలో తిరిగేవారో అదే తీరులో సంచరిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో వున్న సాన్నిహిత్యాన్ని అదే స్థాయిలో కొనసాగిస్తూ వారు ఏర్పాటు చేసే సభల్లో కేసీఆర్, చంద్రబాబు పనితీరు లను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీనిపై పలువురు వెనుక ముందు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికీ వెంకయ్య స్పష్టత ఇచ్చారు వెంకయ్య. భాష నేలపై మమకారం తోనే ఇక్కడే తిరుగుతా అని విప్పి చెప్పేశారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టాక కూడా తాను ప్రోటోకాల్ పదవిలో వున్నా ఆ రూల్స్ తిరగరాస్తానని ప్రజలతో మమేకం అయ్యేలా ఉంటానని మొహమాటం లేకుండానే చెప్పేశారు కూడా.
వెంకయ్య పర్యటనలతో బిజెపి లో కలవరం ...?
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ప్రోత్సహిస్తున్న తీరు బిజెపి వర్గాలను కలవరానికి గురి చేస్తుంది. స్వయంగా తమ పార్టీలో అగ్రస్థానంలో గతంలో వెలుగు వెలిగిన వెంకయ్య ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇంద్రులు చంద్రులుగా కీర్తించడం తో ఇద్దరిపై యుద్ధానికి సిద్ధమైన బిజెపి శ్రేణులను అయోమయానికి గురిచేస్తుంది. దాంతో తమ వేదన ఎవరికి చెప్పుకోలేక కడుపులో పెట్టుకోలేక సతమతం అవుతున్నాయి కమల దళాలు. పార్టీ లో వున్నపుడు ఒకలా ప్రోటోకాల్ లో వున్నప్పుడు మరోలా వెంకయ్య సొంత పార్టీకి ఎర్త్ పెడుతున్నారని ఆయన్ను వ్యతిరేకించే బిజెపి వర్గాలు మరింత ఆవేదన చెందుతున్నాయి.