వెంకయ్య ఇంకా అలాగేనా....?..

Update: 2017-11-07 03:30 GMT

రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి, గవర్నర్ లు స్పీకర్లు ప్రోటోకాల్ చట్రంలో ప్రజలకు దూరంగా వుంటారు. అతి అరుదైన సందర్భాల్లో మాత్రమే వారు సభల్లో పాల్గొంటారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో వున్న వారు ఎలా ఉండాలో నిబంధనలు స్పష్టంగా సూచిస్తున్నాయి. కానీ ఒక్కోసారి వారు కూడా సభలు, సమావేశాల్లో ప్రోటోకాల్ పక్కన పెట్టి పాల్గొనడం అరుదుగానే కనిపిస్తుంది. అలా తమదైన శైలిలో దేశ స్థాయిలో వ్యవహరించిన వారిలో అబ్దుల్ కలాం నిలుస్తారు. ఆయన విద్యార్థులతో మమేకం అయి భావితరాలకు దశాదిశా నిర్దేశించేవారు. ఆయనకు జనం నీరాజనాలు పట్టారు. ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాలపై కేంద్రమంత్రిగా ఎలా మమేకం అయ్యే వారో అలానే ఇప్పుడు సాగిపోతున్నారు. తాను ఇంకా ప్రోటోకాల్ కి అలవాటు పడలేదని కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర లో ఆయన పాల్గొంటున్న సభల్లో పదే పదే చెప్పడం గమనార్హం.

మోడీ బాబులపై అలాగే ప్రశంసలు ...

గతంలో వెంకయ్య నరేంద్రమోడీ , చంద్రబాబు జోడీపై కేంద్రమంత్రి హోదాలో ప్రచారం పెద్దఎత్తున చేస్తూ సభల్లో ఆకట్టుకునే వారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి గా వున్నా పాత పంథాను ఆయన వీడలేదు. తాజాగా రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వెంకయ్య బాబు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని , ప్రధాని మోడీ సైతం అదే స్థాయిలో కష్ట పడి పైకి వచ్చిన తీరును విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఇక తెలంగాణ లో సైతం వెంకయ్య కేసీఆర్ సర్కార్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ వస్తున్నారు. తన కుమార్తె స్వర్ణ భారతి ట్రస్ట్ కార్యక్రమాల్లో ఉత్సహంగా పాల్గొంటున్నారు. ఉపరాష్ట్రపతి వ్యవహార సరళి, తెలుగు రాష్ట్రాల సీఎంల తో ఆయన పలు కార్యక్రమాల్లో ఉండటం చర్చనీయాంశం అయ్యింది.

గతంలో బాలయోగి విభిన్నంగానే ...

వాజపేయి ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా విధులు నిర్వహించిన స్వర్గీయ జీఎంసీ బాలయోగి తనదైన తీరులో పదవిని నిర్వర్తించారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి జనంతో నేరుగా కనెక్ట్ అయ్యేవారు. ఏ చిన్న కార్యక్రమానికి ఎవరు పిలిచినా హాజరు అయ్యేవారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు అదే తీరులో సాగుతున్నారు. ఢిల్లీ కి రాష్ట్ర మంత్రులు ఎవరు వెళ్ళినా కేంద్రమంత్రులదగ్గరకు నేరుగా పంపుతూ వారికి మాట సాయం చేస్తున్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి కేంద్ర చేయూత కోసం వెళ్ళిన ఏపీ టూరిజం మంత్రి అఖిలప్రియకు అలాగే సాయం అందించారు వెంకయ్య. కేంద్రమంత్రులతో అపాయింట్మెంట్ లు ఇప్పించడం లో కూడా ఎంతో చొరవ చూపిస్తున్నారు ఆయన. రాబోయే రోజుల్లో వెంకయ్య ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తారో చూడాలి.

Similar News