వడ్డీకాసుల వాడు , ఆర్తజన రక్షకుడు అయిన తిరు వేంకటనాధుని మించిన పేదవాడు మరొకడు ఉండరు. తన పెళ్లికోసం కుబేరుడి వద్ద తీసుకున్న అప్పునే ఆయన ఈనాటికి కూడా పూర్తిగా చెల్లించలేకపోతున్నారు. రుణవిముక్తుడు కాలేకపోతున్నాడు. ప్రతి ఏటా కుబేరునికి వడ్డీకాసుల్ని లెక్కకట్టి చెల్లిస్తున్నాడే తప్ప.. తీసుకున్న అప్పు అసలు జమ వేయడం అంటూ ఇన్నేళ్లుగా జరగనేలేదు. అసలు వెంకన్నే అప్పుల్లో కునారిల్లుతూ ఉంటే.. ఇప్పుడు నీకు వస్తున్న సొమ్ముల్లో మాకు వాటాలు పెట్టమనే డిమాండ్లతో కొత్త పత్రాలు పట్టుకుని, కొత్త అప్పులవాళ్లు తయారవుతున్నారు. వేంకటనాధుడిని కోర్టుకీడుస్తున్నారు.
తిరుమల వేంకటేశ్వరుడికి ఏటా వచ్చే ఆదాయంలో తెలంగాణ లోని పేద ఆలయాల కోసం వెచ్చించేందుకు ఇక్కడి ప్రభుత్వానికి వాటా చెల్లించాల్సి ఉన్నదంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సౌందర రాజన్ ఈ దావా వేశారు. 2007లో సవరించిన దేవాదాయ చట్టం ప్రకారం తిరుమల ఆలయానికి వచ్చే ఆదాయం , మిగిలిన గుడుల కోసం వాటా పెట్టాల్సిందేనంటూ ఆయన వాదిస్తున్నారు.
తిరుమలకు వచ్చే ఆదాయంలో గరిష్టంగా ధర్మప్రచారానికి, సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తుంటారు. ధూపదీపనైవేద్యాలకు కూడా గతిలేని చిన్న ఆలయాల కోసం నిదులు ఇవ్వడానికే ఇలాంటి చట్ట సవరణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాలలోని చిన్న ఆలయాలను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల వెంకన్న సంపాదనతో ఎందుకు పోషించాలో అర్థం కాని సంగతి. భక్తులు స్వామి కైంకర్యం కోసం నివేదించుకునే కానుకల మీద సర్కారు వారి పెత్తనం ఏంటని.. ఇలా వెంకన్న సొమ్మును దోచుకోవాలనే ప్రయత్నాలు మానుకోవాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ విషయంలో వాస్తవాలు వివరించాలంటూ టీటీడీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. మరి ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.