వెంకన్న అన్నదానానికీ ఎఫెక్ట్ పడిందే?

Update: 2017-10-14 08:30 GMT

తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అన్నదాన పథకానికి నిధుల కొరత ఏర్పడింది. జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా అన్నదానంపై అదనపు భారం పడటంతో దాతలు ఇచ్చిన విరాళంపై వడ్డీతో ఇప్పటి వరకూ నిర్వహించిన టీటీడీ ఇప్పుడు మూలధనం నుంచి నిధులను అన్నదాన కార్యక్రమం కోసం బయటకు తీయాల్సి వస్తోంది. తిరుమల వెంకన్నను దర్శించుకున్న వారు ఎవరైనా సరై అక్కడ ఉచిత అన్న ప్రసాదాన్ని ఒకసారైనా తిని రావాల్సిందే. అది శ్రీవారి ప్రసాదంగా భక్తులు భావిస్తారు. దీంతో రోజుకు అరవై వేల మందికి నిత్య అన్నదానాన్ని టీటీటీ సమకూరుస్తుంది. 1990లో రెండు వేల మందితో ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం ఇప్పుడు అరవై వేల మందికి చేరింది. అన్నదాన కార్యక్రమం కోసం టీటీడీ అప్పట్లో దాతల నుంచి విరాళాలను కోరింది. ఈ కార్యక్రమానికి దాతలు విశేషంగా స్పందించారు. అప్పట్లో భక్తులు ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా...? 160 కోట్ల రూపాయలు. ఈ 160 కోట్ల రూపాయలను టీటీడీ బ్యాంకులో జమ చేసి నెలవారీ వడ్డీ తీసుకుంటుంది. నెలకు ఈ డిపాజిట్ పై 5 కోట్ల రూపాయలు వస్తుంది. దీంతో అన్నదాన కార్యక్రమం సజావుగా సాగిందినిన్న మొన్నటి వరకూ.

మళ్లీ విరాళాలు సేకరించాలా?

అయితే పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత వడ్డీ కూడా తగ్గడం ప్రారంభించింది. జీఎస్టీ భారం పడటంతో మూలధనం నుంచే కొంత మొత్తాన్ని తీయాల్సి వచ్చింది టీటీడీ అధికారులు. తిరుమల అంటేనే నిత్యం రద్దీగా ఉంటుంది. లక్షలాది మంది భక్తులు నిత్యం కొండకు వస్తుంటారు. వారందరికీ ఉచిత అన్నప్రసాదాన్ని అందించాల్సి ఉంటుంది. కేవలం వెంగళాంబ ఉచిత అన్న ప్రసాద సత్రానికి వచ్చే వారికి మాత్రమే కాకుండా క్యూ లైన్లలో ఉన్నవారికి కూడా ప్రసాదాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇంతమంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించాలంటే ఇప్పుడు టీటీడీకి భారంగా మారింది. ఫిక్స్ డ్ డిపాజిట్లు తీసేయాలని ఒకదశలో తలచినా....కొందరు అధికారులు దీనికి విముఖత వ్యక్తం చేయడంతో ఆ ఆలోచన మానుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, జీఎస్టీ భారంతో అన్నదానం కూడా టీటీడీకి భారంగా మారింది. మరోసారి విరాళాలు సేకరించాలని టీటీడీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News