వీరిద్దరూ..స్నేహితులే..కాని కలవరట....!

Update: 2018-02-11 17:30 GMT

ఇద్దరూ అగ్రనటులే... ఇద్దరికీ వీరాభిమానులున్నారు. అయితే లేటు వయసులో ఇద్దరికీ పాలిటిక్స్ పై ప్రేమ పుట్టుకొచ్చింది. ఇద్దరూ సినీరంగంలో స్నేహితులే. రాజకీయాల్లో మాత్రం ఇద్దరూ వేర్వేరు పార్టీలతో వచ్చేస్తున్నారు. వారే సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్. ఇద్దరూ ఒకే సమయంలో రాజకీయాల్లోకి వస్తుండటం విశేషం. ఈ నెల 21వ తేదీన కమల్ రాజకీయ పార్టీని ప్రకటిస్తుండగా, మరికొద్ది రోజుల్లో రజనీకాంత్ తన పార్టీని లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కలిస్తే తిరుగుండదు....

అయితే వీరిద్దరూ కలిస్తే తమిళ రాజకీయాల్లో తిరుగుండదన్నది విశ్లేషకుల అంచనా. అయితే రాజకీయాల్లో మాత్రం వీరు భిన్న ధృవాలు. కమల్ దూసుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. అలాగే వామపక్ష భావాజాలం కమల్ కు అక్కడక్కడా కనిపిస్తుంది. బీజేపీ అంటేనే కమల్ మండిపడతారు. అది ఆయన ఇటీవల చేస్తున్న ట్వీట్లు చూస్తుంటేనే తెలుస్తుంది. కమల్ హసన్ త్వరలోనే రాష్ట్ర పర్యటనకు కూడా శ్రీకారం చుడుతున్నారు. మధురై నుంచి ఆయన పర్యటన ప్రారంభం కాబోతుంది.

అది వదులుకోకుంటే....

ఇక రజనీకాంత్ కమల్ హాసన్ కు పూర్తిగా వ్యతిరేకం. నెమ్మదిగా వెళ్లే మనస్తత్వం. ఆయన ఆచితూచి అడుగులేస్తారు. అయితే రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించడం... వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని అభిమానులకు తెలపడంతో ఆయన పార్టీ కూడా తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించే అవకాశముంది. అయితే రజనీకాంత్ సర్దుకుపోయే వ్యక్తి. ప్రధాని మోడీపై అనేకసార్లు ప్రశంసలు కురిపించారు. అయితే వీరిద్దరూ కలుస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీలూ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే దీనికి రజనీకాంత్ మాత్రం కాలమే సమాధనం చెబుతుందన్నారు. కమల్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. తాను, రజనీ మంచి స్నేహితులమే కాని ఆయనలో కాషాయ రంగులు కన్పిస్తున్నాయన్నారు. బీజేపీ అనుకూల విధానాలను రజనీ వదులుకోకుంటే ఆయనతో కలిసే ప్రసక్తి లేదని కమల్ తాజాగా తేల్చి చెప్పారు. సో... రజనీ, కమల్ కలిసే అవకాశాలే లేవన్నది తేలిపోయింది. మరి విడివిడిగా పోటీ చేస్తే ఎవరికి లాభం?

ి

Similar News