వీరిద్దరికీ అక్కడే సంక్రాంతి...!

Update: 2017-12-28 01:30 GMT

సంక్రాంతి పండక్కి ఇద్దరూ అక్కడే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్ లు ఇద్దరూ చిత్తూరు జిల్లాలోనే ఉంటారు. నేటినుంచి చిత్తూరు జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. దాదాపు 250 కిలోమీటర్ల మేర ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. ఈ పాదయాత్రకు కనీసం ఇరవై రోజుల సమయం తీసుకుంటుంది. అయితే ఇదే సమయంలో సంక్రాంతి పండగ రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సంక్రాంతి పండుగకు తన స్వగ్రామమైన నారావారిలపల్లెకు కుటుంబంతో కలిసి వస్తారు. అక్కడే పండగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే సమయంలో జగన్ కూడా ఇదే జిల్లాలో పర్యటించనున్నారు.

నేడు తంబళ్లపల్లి నియోజకవర్గంలోకి...

తొలుత నేటి నుంచి తంబళ్ల పల్లి నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. 1999, 2004లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కడప ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2009, 2014 ఎన్నికల్లో మాత్రం వరుసగా ఇక్కడ టీడీపీ గెలుస్తూ వస్తోంది. దీంతో తంబళ్లపల్లిలో ఈసారి ఎలాగైనా గెలుపు సాధించాలని వైసీపీ అధినేత పట్టుదలతో ఉన్నారు. అందుకోసమే ఈ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

రేపు మధ్యాహ్నం వరకేనా...?

జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 46వ రోజుకు చేరుకుంది. ఉదయం 8గంటలకు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండలం బలిజపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. తర్వాత కొద్దిసేపటికే చిత్తూరు జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం యెద్దుల వారికోట నుంచి బయలుదేరి వేమనగిరి పల్లికి చేరుకుని అక్కడ జగన్ పార్టీ జెండాను రేపు ఉదయం 9గంటలకు ఆవిష్కరించనున్నారు. తర్వాత ఆర్ఎస్ తాండా, కొట్టాల క్రాస్ రోడ్స్ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. తర్వాత వసంతపురం చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు వసంతపురం చేరుకుంటారు. అయితే శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి రావడంతో జగన్ మధ్యాహ్నానికి యాత్ర ముగించి హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.

Similar News