ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు జూలు విదులుస్తున్నారు. దినకరన్ వర్గీయులగా ముద్రపడిన వారందరినీ వరుసబెట్టి పార్టీ నుంచి తప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దినకరన్ కు అండగా ఉంటారనుకున్న వారిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు తాఖీదులు పంపారు. తాజాగా దినకరన్ వర్గీయులుగా భావించిన 53 మంది పై అన్నాడీఎంకే వేటు వేసింది. దీంతో దాదాపు వెయ్యి మందిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు అన్నాడీఎంకే అధికార వర్గాలు వెల్లడించాయి. దినకరన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తుండటం, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్డర పడుతుండటంతో అధికార అన్నాడీఎంకే పార్టీ సత్వర చర్యలను ప్రారంభించింది.
వెయ్యి మందిపై వేటు....
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే కు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు దినకరన్ కు సహకరించారన్న సమాచారం వారిని కలవరపర్చింది. తమ నాయకత్వానికి ఎక్కడ ఎసరు వస్తుందోనని భావించిన పన్నీర్, పళని వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ సహకరించిన 147 మందిపై అప్పటికప్పుడే వేటు వేశారు. దీంతో పాటుగా దినకరన్ అన్ని నియోజకవర్గాల నేతలతో టచ్ లో ఉన్నారని చెప్పడం, తనకు ప్రభుత్వంలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని చెప్పడంతో వీరిద్దరూ మరింత అప్రమత్తమయ్యారు.
ప్రత్యేక నిఘా సమాచారంతో....
ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేసుకున్నారు. ఇంటలిజెన్స్ నివేదికను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తిరుప్పూర్, పుదుకొట్టై, ధర్మపురి, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో అనేక మంది దినకరన్ వర్గీయులపై వేటు వేశారు. వీరు అన్నాడీఎంకేలోనే ఉంటూ దినకరన్ కు సహకరిస్తున్నారు. అంతేకాదు దినకరన్ పర్యటన ఏర్పాట్లు కూడా వీరు పరోక్షంగా చూస్తున్నట్లు తెలియడంతో తాజాగా 53 మందిపై వేటు వేశారు. దినకరన్ ప్రమాదం భవిష్యత్తులో పొంచి ఉందని భావించిన పన్నీర్, పళనిలు మొగ్గలోనే తుంచివేసేందుకు చర్యలు ప్రారంభించారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని....
అయితే ఇప్పటికే వెయ్యి మంది వరకూ వివిధ జిల్లాల్లో నేతలను పార్టీ నుంచి బయటకు పంపించివేశారు. వీరి స్థానంలో కొత్తవారిని చేర్చుకునేందుకు వ్యూహం రచించారు. ముఖ్యంగా యువకులను ఎక్కువగా చేర్చుకోవాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములు పళని, పన్నీర్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తాయన్న దానిలో సందేహం లేదు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి పాలయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకేలో ఉన్న శశికళ సానుభూతి పరులు రాజీనామా చేయాలన్న డిమాండ్ చేస్తారని ఊహించి ముందుగానే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతున్నారన్న టాక్ తమిళనాడులో విస్తృతంగా విన్పిస్తుంది. మొత్తం మీద దినకరన్ నీడ కూడా పార్టీ మీద పడకుండా పళని, పన్నీర్ లు జాగ్రత్త పడుతున్నారన్నమాట.