ఈ ఇద్దరూ చేతులు కలిపారు. పార్టీ మొత్తం తమదేనని బిల్డప్ ఇచ్చారు. అధికారంలో ఉన్న తమకు తిరుగులేదని సిగ్నల్స్ ఇచ్చారు. కాని ఫలితం లేదు. ఇద్దరూ పనికిరాని నేతలుగానే మిగిలిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు బిల్డప్ తప్ప ప్రజల మద్దతు లేదని ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాలతో తేలిపోయింది. వైరి వర్గాలుగా ఉన్న ఇద్దరూ ఒక్కటయ్యారు. పన్నీర్ సెల్వం పెట్టిన షరతులకు పళనిస్వామి తలొగ్గారు. తనకు ఉప ముఖ్యమంత్రి కావాలని, శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని పెట్టిన కండిషన్ కు పళనిస్వామి అయిష్టంగానే ఓకే చెప్పాల్సి వచ్చింది.
కాలికి బలపం కట్టుకుని తిరిగినా....
ఇద్దరు నేతలు ఆర్కే నగర్ లో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ఉప ముఖ్యమంత్రి. ఆర్కేనగర్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అమ్మకు అసలైన వారసులం తామేనని చెప్పుకున్నారు. అభ్యర్థి ఎంపిక నుంచి వీరు మామూలుగా వ్యవహరించలేదు. ఇందుకోసం కమిటీని వేశారు. దరఖాస్తులను ఆహ్వానించారు. చివరకు పన్నీర్ సెల్వం నమ్మకస్తుడు మధుసూదనన్ అభ్యర్థిగా చేశారు. రేయింబవళ్లూ ఆర్కే నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇక మంత్రుల సంగతి సరేసరి. ప్రతి వార్డుకూ ఒక మంత్రి ఇన్ ఛార్జిగా ఉన్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
గుర్తొచ్చినా....ఓట్లు పడకపోయే....
అన్నాడీఎంకే పార్టీతో పాటు రెండాకుల గుర్తు కూడా ఎన్నికల కమిషన్ పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకే కేటాయించడంతో మరింత రెచ్చిపోయారు. అమ్మ వదిలిపెట్టి పోయిన గుర్తు తమను విజయతీరాలకు చేరుస్తుందని అతి విశ్వాసానికి పోయారు. అంతేకాదు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై కూడా వీరికి ఎదురుదెబ్బ తగలడానికి కారణంగా చెబుతున్నారు. అమ్మ ఆశయాలను అమలు చేస్తున్నామని చెప్పి ఢిల్లీకి దాసోహమనడమే వీరిద్దరి కొంప ముంచింది. ఓఖీ తుఫాను బీభత్సాన్ని పట్టించుకోకపోవడం, తుఫాను బాధితుల విస్మరించిన ప్రభావం కూడా ఈ ఎన్నికపై పడిందంటున్నారు. మొత్తం మీద జయ తర్వాత తామేనని గొప్పలు పోతున్న వీరిద్దరికీ ఆర్కేనగర్ ప్రజలు చెక్ పెట్టారనే చెప్పొచ్చు.