వీరికి ఇప్పటికీ వెంకయ్యే ఆధారమా?

Update: 2017-12-22 06:30 GMT

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయినా ఆంధ్రప్రదేశ్ కు పెద్దదిక్కుగా మారారు. గతంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య విభజన సమస్యలపై దృష్టి పెట్టేవారు. తానే అన్ని శాఖల మంత్రుల వద్దకు వెళ్లి ఫైళ్ల వేగాన్ని పెంచేవారు. రాష్ట్రానికి ఇతోధికంగా సాయం అందించేవారు. కాని వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత ఏపీలోని బీజేపీ, టీడీపీ నేతలకు ఢిల్లీలో పెద్దదిక్కులేకుండా పోయింది. కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ దొరకడమే కష్టంగా మారింది. మరోవైపు ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో విభజన సమస్యలను పరిష్కరించాలని ఢిల్లీకి వెళుతున్నా కేంద్రమంత్రులు వీరిని పట్టించుకోవడం లేదు.

అపాయింట్ మెంట్ల కోసం....

దీంతో ఏపీకి చెందిన టీడీపీ నేతలు మళ్లీ వెంకయ్యనే ఆశ్రయించాల్సి వస్తుంది. వెంకయ్య ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్నా ఏపీ సమస్యల పరిష్కారాన్ని తిరిగి తన భుజాన వేసుకున్నట్లు కన్పిస్తోంది. గతంలో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఢిల్లీ వెళ్లినప్పుడు ఆమెకు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ వెంకయ్య ఇప్పించారు. రెండు రోజుల క్రితం పోలవరం సమస్యపై చర్చించడానికి ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ నేతలకు కూడా జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పిలిపించుకుని తన సమక్షంలోనే పోలవరం పై సమీక్ష చేశారు.

తన సమక్షంలోనే మంత్రులతో సమీక్ష.....

ఇక తాజాగా కడప స్టీల్ ఫ్యాక్టీరీ ఏర్పాటు కోసం మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, కేంద్రమంత్రి సుజనా చౌదరి తదితరులకు పార్లమెంటు ఆవరణలోనే మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ వెంకయ్య సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కడప, బయ్యారంలలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై సాథ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మాత్రమే విభజన చట్టంలో ఉందని, ఒకసారి స్టడీ చేస్తే సాధ్యం కాదని తేలిందని, అందుకని మరోసారి అధ్యయనం చేయించామని బీరేంద్రసింగ్ వివరించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని మంత్రి బీరేంద్ర సింగ్ కు సూచించారు. మొత్తం మీద ఇటు బీజేపీ, అటు తెలుగుదేశం నేతలకు ఇప్పటికీ వెంకయ్యే పెద్దదిక్కుగా మారారు. వెంకయ్య లేనిదే మనోళ్లకు అపాయింట్ మెంట్ కూడా దొరకక పోవడంతో ఆయనమీదనే రెండు పార్టీల నేతలూ ఆధారపడ్డారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి అయినా... తన సమయాన్ని ఏపీ కోసం కేటాయిస్తుండటం విశేషం.

Similar News