వీరి భేటీ ఎందుకో?

Update: 2018-02-18 18:29 GMT

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ ల భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇద్దరూ అగ్రనటులే కావడం, ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తున్నామంటూ ప్రకటనలు చేయడంతో వీరిద్దరి సమావేశం తమిళనాడులో వేడి పుట్టించింది. ఆదివారం రజనీకాంత్ తో కమల్ హాసన్ సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. గత కొన్నాళ్ల నుంచి తమిళ రాజకీయాలు హీట్ ఎక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఎన్నికల వేడి ఇప్పటి నుంచే ఆ రాష్ట్రంలో నెలకొని ఉంది.

రజనీకాంత్ ఈ ఏడాది.....

ఇందుకు ప్రధాన కారణం తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు అగ్రనటులైన కమల్, రజనీ కాంత్ లు ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తుండటమే. రజనీకాంత్ తన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే రజనీ సభ్యత్వాలను కూడా ముమ్మరం చేశారు. అభిమానులతో సమావేశమవుతున్నారు. ఆయన ఈ ఏడాదే పార్టీ ప్రకటించే అవకాశముంది. అందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు రజనీ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

కమల్ ఈ నెల 21న......

ఇక మరో అగ్రనటుడు కమల్ హాసన్ కూడా ఈ నెల 21వ తేదీన మధురైలో పార్టీని ప్రకటించనున్నారు. ఆయన ఇప్పటికే మాజీ ఎన్నికల ప్రధాన అధికారి శేషన్ ను కలిసి కొన్ని సలహాలను కూడా తీసుకున్నారు. పార్టీ ప్రకటనకు ఎక్కువ సమయం లేకపోవడంతో కమల్ పార్టీ ఆవిర్భావ ప్రకటన సభకు రావాల్సిందిగా రజనీకాంత్ ను ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని రజనీకాంత్ కూడా ధృవీకరించారు. అయితే కమల్ మాత్రం తమ మధ్య రాజకీయ చర్చలేవీ జరగలేదని చెప్పారు. వీరిద్దరూ ఏకం కావాలని తమిళనాడులో ఇద్దరి అభిమానులు కోరుకుంటున్నారు. కాని కమల్ మాత్రం సమయం వచ్చినప్పుడు చూద్దాం అని చెబుతున్నారు. మొత్తం మీద వీరిద్దరి కలయిక తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Similar News