మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు వస్తున్నా ప్రశ్నార్థకంగానే వుంది. విశాఖపట్నంలో వెలుగుచూసిన అరాచకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. వైజాగ్ లోని సెజ్ లో బ్రాండెడ్ గార్మెంట్స్ కు అనుబంధంగా పనిచేసే షోర్ టూ షోర్ కంపెనీలో ఛత్తీస్ ఘడ్ నుంచి వచ్చి ఉద్యోగం చేస్తున్న మహిళను జీఎం తొలుత రాజమండ్రి లోని ఒక లాడ్జ్ కి తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో వీడియో తీసి సోషల్ మీడియా లో పెడతానని ఆమెను బెదిరించి పలుసార్లు తరువాత కూడా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ వ్యవహారం కార్యాలయంలోని మేనేజర్ మిత్రులకు తోటి ఉద్యోగులకు లీక్ కావడంతో ఆమెను వారు కూడా బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి ఆరోపణ.
నాకు ప్రాణ రక్షణ కల్పించాలి .....
వీరి దుర్మార్గాన్ని భరించలేని బాధితురాలు విశాఖ అచ్యుతాపురం పీఎస్ లో ఫిర్యాదు చేసింది. కంపెనీ జనరల్ మేనేజర్ దిలీప్ రాజకీయంగా, ఆర్ధికంగా బలమైన వ్యక్తి అని కేసును తారుమారు చేసే అవకాశం ఉందని తనకు న్యాయం చేయడంతో బాటు ప్రాణరక్షణ కల్పించాలని బాధితురాలు వేడుకుంది. ఈ కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుల్లోని ఇద్దర్ని అరెస్ట్ చేయగా మరో ఐదుగురు పట్టుకోవాలిసి వుంది. ఈ సంఘటనపై విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని ఉద్యోగినులకు పనిచేసే చోట భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.