విశాఖలోని భూ కుంభకోణం అధికార టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. సాగరతీరంలో భూములు అత్యంత విలువైనవి కావడంతో భూకబ్జాలకు పాల్పడుతున్నారు. విశాఖలో దాదాపు ఇరవై వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని అంచనా వేస్తున్నారు. రికార్డులను మార్చేయడం, పేర్లను చెరిపేసి వేరే పేర్లను జతచేసి కొత్త డాక్యుమెంట్లను సృష్టించి ఈ భూమాయాజాలానికి తెరలేపారు భూ బకాసురులు. విశాఖనగరం అందమైనదే కాకుండా పారిశ్రామకంగా ఎదుగుతున్న నగరం కావడంతో భూ భకాసులు కళ్లు ప్రభుత్వ, ప్రయివేటు భములపై పడ్డాయి. కలెక్టర్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే అన్యాక్రాంతమైన భూములను కాపాడతామని కలెక్టర్ చెబుతున్నా... అధికారపార్టీ నేతల ఒత్తిడి పెరుగుతుండటంతో భూ కుంభకోణం వెనక అసలు సూత్రధారులు మాత్రం బయటపడటం లేదు.
20 వేల కోట్ల విలువైన భూములు......
మధురవాడ, కొమ్మాడి రెవెన్యూ గ్రామాల్లో 1బి ట్యాంపరింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. రెండు నెలల క్రితం తనిఖీ చేసినప్పుడు 22 ఖాతాలు ట్యాంపరింగ్ చేశారు. ఉదాహరణకు ఒక రైతు పేరు మీద కొంత భూమి ఉంటే దానికి అదనంగా మూడు, నాలుగు ఎకరాలను చేర్చి సర్వే నెంబర్లను కలిపేశారు. ప్రస్తుతం అధికారులు జియో ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా అన్యాక్రాంతమైన భూములేవన్నదీ గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకు కొందరు రెవెన్యూ అధికారులు కూడా సహకరించినట్లు తనీఖీల్లో బయటపడింది. అలాగే దసపల్లా హిల్స్ భూకుంభకోణంలో టీడీపీ ముఖ్య నేతల పేర్లు బయటకు వచ్చాయి. సుమారు ఐదు వేల ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దస్ పల్లా హిల్స్ నగరం నడిబొడ్డున ఉంటుంది. సర్వే నెంబర్ 1027, 1028, 1196, 1197 సర్వే నెంబర్లలో సుమారు 63 ఎకరాల స్థలం ఉంది. దీని పక్కనే గవర్నర్ బంగళా కూడా ఉంది. ఇక్కడ గజం ధర రెండు లక్షలకు పైమాటే. ఈ భూముల రికార్డులను కూడా తారుమారు చేసినట్లు తనిఖీల్లో స్పష్టమైంది. మొత్తం మీద విశాఖ నగరంలో భూ కబ్జాలపై ఈ నెల 15వ తేదీన బహిరంగ విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖలో గజం స్థలాన్ని కూడా భూ బకాసురులు వదలడం లేదు. దీనిపై స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరుతున్నారు.