తెలుగుదేశం పార్టీ నేతలపై భూకబ్జాల ఆరోపణలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని సమీప ప్రాంతంలో భూములకు విలువ పెరగడంతో నయానా, భయనా ఒప్పించి కొందరు కొనుగోలు చేస్తుండగా, మరికొందరు దౌర్జన్యంగా భూములును ఆక్రమించుకుంటున్నారు. భూములకు విలువ పెరగడంతో పాటు భవిష్యత్ బంగారం అని భావించి ఎక్కువగా పొలిటికల్ లీడర్లే ఈ కబ్జాలకు పాల్పడుతున్నారు. పార్టీలకు అతీతంగా ఇవి జరుగుతున్నాయి. అయితే అధికార తెలుగుదేశం పార్టీ ఒకడుగు ముందుకేసి భూకబ్జా ఆరోపణలను ఎక్కువగా ఎదుర్కొంటోంది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు అధికారంలోకి రాగానే ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తుండటంతో రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ స్థలాలకు, పొలాలకు రేయింబవళ్లూ కాపలా కాయలేక కళ్లు కాయలు కాస్తున్నాయి. గతంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై ఈరకమైన ఆరోపణలొచ్చాయి.
పోలీసుల వద్దకు వెళితే న్యాయం జరగక.....
తాజాగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణ తన భూమిని ఆక్రమించారంటూ ఒక రైతు హైకోర్టును ఆశ్రయించడం సంచలనం కల్గించింది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామంలోని సర్వే నెంబర్ 167, 168లో తనకు చెందిన 11.60 ఎకరాల భూమిని స్పీకర్ కుమారుడు కోడెల శివరామకృష్ణ ఆక్రమించారంటూ రైతు గొడుగుల సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వద్దకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో రైతు సుబ్బారావు దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, డీజీపీకి నోటీసులు జారీ చేశఆరు. కోడెల శివరామకృష‌్ణకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం మీద ఈ భూ వివాదం ఏపీలో కలకలం రేపుతోంది.