నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి మధ్య వార్ నడుస్తోంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్య వివాదం పోలీస్ స్టేషన్ల వరకూ వెళ్లింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ కుమారుడు జగన్ తనను బెదిరిస్తున్నారంటూ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమెల్సీ భూపతిరెడ్డిపై ఎమ్మెల్యే బాజిరెడ్డి అల్లుడు సంపత్ కేసు పెట్టారు. తనపై ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో కించపరుస్తూ పోస్టులు పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇలా రెండు వర్గాలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య గత రెండేళ్లుగా వివాదాలు జరుగుతున్నా అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు. చూసీ చూడనట్లు వదిలేయడంతో ఇది మరింత ముదిరింది. దాదాపు నెలలో ఒకసారి వీరిద్దరి మధ్య ఏదో ఒకవివాదం నడుస్తూనే ఉంది.
కవిత వివాదాన్ని పరిష్కరించాలని చూసినా....
అయితే వీరిద్దరి మధ్య పంచాయతీని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటుంటే క్యాడర్ లో అయోమయం నెలకొంటుందని వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. అయినా ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. భూపతిరెడ్డికుమారుడు నాలుగైదు నెలల క్రితం ఒక కేసులో ఇరుక్కోవడంతో కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆ కేసు పరిష్కారం కావడంతో ఇటీవలే మళ్లీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి మళ్లీ మామూలయింది. నిజామాబాద్ లో బీజేపీకి కొంత పట్టుంది. వీరి మధ్య నెలకొన్న వివాదాలను క్యాష్ చేసుకోవాడనికి కమలం నేతలు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీకి ఈ ఇద్దరు నేతలు తలనొప్పిగా మారారు.