విజయశాంతి ఎట్టకేలకు....?

Update: 2017-11-05 12:30 GMT

రాములమ్మ ఎట్టకేలకు బయటకు వచ్చారు. విజయశాంతి గత మూడున్నరేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయశాంతి ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. గాంధీ భవన్ ను ఇంతవరకూ విజయశాంతి చూడలేదంటే నమ్మండి... అని కాంగ్రెస్ నేతలు ఛలోక్తులు విసురుకున్న సందర్భాలూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా తలపెట్టిన కార్యక్రమాలకు రాములమ్మ ముఖం చాటేసింది. అంతేకాదు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ వచ్చిన నాకేంటి? అన్న రీతిలో విజయశాంతి వ్యవహారం సాగింది. రాహుల్ వచ్చినా రాములమ్మ ఆ సమావేశానికి రాకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

కుంతియాను కలిసిన శాంతి......

అయితే కాంగ్రెస్ లో ఇటీవల కాలంలో జోష్ కన్పిస్తుండటం, రేవంత్ లాంటి నేతలు పార్టీలోకి రావడం... ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్లీ రాములమ్మ లైమ్ లైట్ లోకి వచ్చారు. శనివారం హైదరాబాద్ వచ్చిన తెలంగాణ పార్ట ీఇన్ ఛార్జి కుంతియాను విజయశాంతి కలిశారు. కుంతియాతో దాదాపు అరగంట పాటు సమావేశమైన విజయశాంతి రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న వివిధ పరిణామాలను చర్చిచంచినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇన్నాళ్లూ పార్టీని పట్టించుకోని విజయశాంతి ఇవాళ తమ పార్టీ నేతను కలుసుకోవడం పట్ల కొందరు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా వారి వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని, ఓట్లు రావని వారికి అనవసరంగా ప్రాధాన్యత ఇవ్వడమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద రాములమ్మ రీ ఎంట్రీ కాంగ్రెస్ నేతల్లో కొందరికి సంతోషాన్ని నింపగా మరికొందరిని ఆగ్రహానికి గురి చేసింది.

Similar News