వారి కోసమే అందరూ

Update: 2018-02-23 20:30 GMT

తెలంగాణ రాజకీయాలు రైతుల చుట్టూనే తిరుగుతున్నాయి. రైతు జనబాంధవుడు కేసీఆర్ అంటూ టి సర్కార్ భారీగా ప్రచారం నిర్వహిస్తుంటే విపక్షాలు రైతు ద్రోహి అంటూ అదే స్థాయిలో టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాయి. ఇక టి జేఏసీ నేత కోదండరాం తన కొత్త పార్టీ తెలంగాణ జన సమితిగా దరఖాస్తు చేసుకోవడంతో బాటు నాగలి గుర్తు పార్టీ సింబల్ గా ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. కోదండరాం సైతం రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా జనంలోకి దూసుకుపోవాలని భావిస్తున్నారన్నది ఆయన ఎన్నికల గుర్తే చెబుతుంది. ఇక కాంగ్రెస్ సైతం రైతు సమస్యలు, సాగునీటి ప్రాజెక్ట్ ల అవినీతిని పాదయాత్రలు, బస్సు యాత్రలతో ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనే వ్యూహంతోనే కదులుతుంది. కేసీఆర్ సర్కార్ రైతులకు వరాలపై వరాలు కురిపిస్తున్నారు. దాంతో టి రాజకీయం రాబోయే రోజుల్లో అన్నదాత కేంద్రంగానే యుద్ధానికి సిద్ధమౌతుందని తేలిపోతుంది.

ఖమ్మంలో భగ్గుమన్న మిర్చి, టమాటా రైతులు ...

ఇదిలావుంటే ఖమ్మం జిల్లాలో రైతులు తమకు గిట్టుబాటు ధర లేదంటూ ఉద్యమ బాట పట్టారు. దళారులతో అధికారులు కుమ్మక్కయ్యి రైతులను దగా చేస్తున్నారన్నది వారి ఆరోపణ. పంట కు గిట్టుబాటు ధర లేకపోవడంతో పలు ప్రాంతాల్లో టమాటా రైతులు పండించిన పంట రోడ్డుపాలు చేసి తమ నిరసన తెలిపారు. మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ సమస్య పరిష్కారానికి సర్కార్ సీరియస్ గా దృష్టిపెట్టకపోవడంతో విపక్షాల చేతికి రైతు ల ఆందోళన ఆయుధంగా దొరికింది. విపక్షాలన్నీ ఇప్పుడు రైతులపక్షాన పోరాటానికి సిద్ధం కావడంతో గిట్టుబాటు ధర అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Similar News