టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. దాదాపు 35 మంది ఎమ్మెల్యేల కుటుంబసభ్యుల జోక్యం నియోజకవర్గాల్లో ఎక్కువయిందని కేసీఆర్ సూటిగా వారికే చెప్పడం విశేషం. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తనయుల ప్రమేయం ఎక్కువయింది. శాసనసభ్యుల కుమారులే ఎక్కువగా పాలనలో జోక్యం చేసుకుంటున్నారు. అధికారుల బదిలీల దగ్గర నుంచి అభివృద్ధి పనుల వరకూ అంతా కొడుకులకే అప్పగించారు కొందరు ఎమ్మెల్యేలు. పోలీస్ స్టేషన్ల పంచాయతీల నుంచి కలెక్టరేట్లో పనుల వరకూ అన్ని వారే చూసుకుంటున్నారు. దీంతో కేసీఆర్ జరిపించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. కుమారుల కారణంగానే దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్లు గమనించారు. కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చున్నప్పటికీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. నిఘా వర్గాలను ఏర్పాటు చేసుకున్నట్లుంది. అందుకే ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందీ ఆ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే కంటే ముందుగా కేసీఆర్ కు తెలిసిపోతుంది.
పద్ధతి మార్చుకోండని హెచ్చరిక.....
ఈ నేపథ్యంలో 35 మంది ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని సూచించారట. తనకు అత్యంత సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యేకు కూడా వచ్చే ఎన్నికల్లో సన్ స్ట్రోక్ తగల నుందని సమాచారం అందడంతో వెంటనే ఆయనను అప్రమత్తం చేశారు. కుమారులను దూరంగా పెట్టమని ఆయనకు స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారట. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ వారసుల బెడద ఎక్కువగా ఉన్నట్లు కేసీఆర్ దృష్టికి వచ్చింది. కొత్తగా ఎమ్మెల్యేల అయిన వారి తనయులు కూడా ఎక్కువగా జోక్యం చేసుకోవడంతోవారికి కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే కొందరు మాత్రం తమ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు వారిని ఇప్పటి నుంచి నియోజకవర్గాల్లో తిప్పుతున్నామని వివరణ ఇచ్చుకున్నారు. దానికి కూడాకేసీఆర్ అంగీకరించలేదట. అటువంటి ఆలోచన ఉంటే నేరుగా రాజకీయాల్లోకి దింపాలి కాని, స్టేషన్ల పంచాయతీలకు పంపవద్దని ఘాటుగానే హెచ్చరికలు జారీ చేశారు.