వారం నుంచి ఆ నేత మౌనదీక్ష ఎందుకో?

Update: 2018-01-11 04:30 GMT

వారంరోజుల నుంచి ఆయన మౌన దీక్ష చేస్తున్నాడు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కలెక్టర్ కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయనే ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు. ఈదర హరిబాబుది ప్రత్యేక స్టయిల్. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఈదర హరిబాబు వెంటనే ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ మరణానంతరం పార్టీలో ఉన్నా ఆయనకు తగిన గుర్తింపు లభించలేదు. చివరకు పార్టీలోనే ఉన్నా ప్రయోజనం లేదని గ్రహించి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలిచి జడ్పీ ఛైర్మన్ గిరీని దక్కించుకున్నారు. వైసీపీకి చేరువయ్యాడని భావించిన టీడీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

విన్నూత్న నిరసనలు....

జడ్పీ ఛైర్మన్ నుంచి తొలగించాలని టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. అయినా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరీ జడ్పీ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. అయితే ఆయనకు ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఈదర ఎప్పుడు తన నిరసనను తెలపాలన్నా విన్నూత్న రీతిలో తెలుపుతారు. జడ్పీ ఉద్యోగుల్లో సత్ప్రవర్తన రావాలని ఒక సారి దీక్ష చేపట్టి ఈదర సంచలనం సృష్టించారు. జడ్పీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా తన నిరసనను ఏదో ఒకరూపంలో తెలియజేస్తూ ఉంటారు. జడ్పీ స్కూల్లో టీచర్లు చేసిన తప్పుకు తనకు తానే శిక్ష విధించుకున్నాడు. దాదాపు రెండు గంటలు ఎర్రటి ఎండలో నిలబడి నిరసన తెలిపారు. ఇలా ఈదర వింత వింత నిరసనలతో తన పనులను కానిచ్చేసుకుంటున్నారు.

కలెక్టర్, మంత్రులు హాజరుకాలేదని...

అయితే తాజాగా జడ్పీ సమావేశానికి కలెక్టర్ హాజరుకాలేదు. సమావేశానికి కలెక్టర్ హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఈదర వెంటనే మౌనదీక్షకు దిగారు. కలెక్టర్ వచ్చి జవాబు చెబితే గాని తాను దీక్షను విరమించబోనంటున్నారు. గత వారం రోజుల నుంచి ఈదర మౌన దీక్షలోనే ఉన్నారు. ఏదైనా పనులు ఉన్నా సిబ్బందికి పేపర్ మీద రాసి చూపిస్తున్నారు. ఆదేశాలు కూడా కాగితాల ద్వారానే అందిస్తున్నారు. ఇది చూసిన జడ్పీ ఉద్యోగులు నివ్వెర పోతున్నారు. సైగలతోనే కాలం నెట్టకొస్తున్నారు. అయితే ఈదరకు జిల్లాలో పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సంఘీభావాన్ని ప్రకటించారు. జడ్పీ సమావేశాలకు మంత్రులు, కలెక్టర్ హాజరు కాకపోవడాన్ని విన్నూత్నంగా నిరసన తెలుపుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు ఈదర. మంత్రులు, కలెక్టర్ జడ్పీ సమావేశానికి హాజరు కాకుంటే తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలన్నది సభ్యుల ఆవేదన. సభ్యుల ఆవేదనను తన మౌనదీక్షతో తెలియజేస్తున్నారు ఈదర హరిబాబు. మొత్తానికి ఈదర వ్యవహారం ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.

Similar News