ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర సమితి తన వాయిస్ ను పెంచింది. కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికే సిద్ధమయింది. విభజన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడాన్ని తప్పుపడుతూ లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ ఎన్ని సార్లు విన్నపాలు చేసినా పట్టించుకోవడం లేదని, దీనివల్ల తెలంగాణ న్యాయవాదులు అన్యాయమై పోతున్నారని టీఆర్ఎస్ ఎంపీలు వాదిస్తున్నారు. లోక్ సభ కార్యక్రమాలను కూడా అడ్డుకున్నారు. మంత్రి దీనిపై ఈరోజు సమాధానం చెబుతామన్నారు.
హైకోర్టు విభజన చేయాంటూ....
రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం హైకోర్టు విభజన జరగాల్సి ఉంది. కాని నాలుగేళ్లు గడుస్తున్నా అడుగుముందుకు పడటం లేదు. ఏపీ ప్రభుత్వం స్థలం చూపితే వెళ్లిపోతామంటున్నారు. కాని ఇంతవరకూ ఏపీ సర్కార్ స్థలాన్నే చూపలేదని టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి హైకోర్టు కారణంగా పదోన్నతుల్లో, న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందన్నారు. దీనికి నిర్దిష్ట కాలపరిమితిని విధించి వెంటనే హైకోర్టును విభజించాలని వారు కోరారు.
ఏపీ కూడా సిద్ధమైంది.....
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ హైకోర్టును అమరావతిలో తాత్కాలిక భవనంలో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. కక్షిదారులు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని ఏపీ సర్కార్ కూడా ఆలోచనలో పడింది. ఈ మేరకు మూడు తాత్కాలిక భవనాలను సిద్ధం చేశారు. వాటిలో పరిశీలించి ఏదో ఒక దానిని ఫైనల్ చేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి చంద్రబాబు నేడో, రేపో లేఖ రాయనున్నారు. వచ్చే ఏడాది మే నాటికి భవనాలను సిద్ధం చేసి జూన్ నాటికి అమరావతిలో హైకోర్టు ప్రారంభించాలన్నది ఏపీ సర్కార్ లక్ష్యంగా కన్పిస్తుంది.