వాణి ఎంట్రీతో ఎఫెక్ట్ ఎవరికి?

Update: 2017-11-07 02:30 GMT

మళయాల నటి వాణి విశ్వనాథ్ ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. ఆమె టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. చంద్రబాబును ఈరోజు కలవనున్నట్లు వాణి విశ్వనాథ్ తెలిపారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని వాణి విశ్వనాథ్ ప్రకటించారు. వాణి విశ్వనాథ్ కేరళకు చెందిన తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. ఆమె చంద్రబాబును కలిసేందుకు గుంటూరు చేరుకున్నారు. వాణి విశ్వనాథ్ ను పార్టీలోకి తీసుకురావాలని గత కొంతకాలంగా నగరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. నగరిలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చెక్ పెట్టాలంటే వాణిని రంగంలోకి దించాలని నగరి నియోజకవర్గంలో కొందరు పార్టీ నేతలు ఇప్పటికే లోకేష్ ను కలిసి మంతనాలు జరిపారు.

నేడు చంద్రబాబుతో భేటీ.....

వాణి విశ్వనాథ్ కూడా అధిష్టానం అదేశిస్తే నగరి నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. అయితే నగరి నియోజకవర్గంలో ఇప్పటికే ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు, ఆయన తనయులకు పట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో తన తనయుల్లో ఒకరికి టిక్కెట్ ఇప్పించుకోవాలని సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాణి ఎంట్రీతో నగరి నియోజకవర్గంలోని పార్టీలో విభేదాలు తలెత్తే అవకాశముంది. అయితే వాణి విశ్వనాథ్ ను నగరి నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలా? లేక పార్టీ ప్రచారానికే పరిమితం చేయాలా? అన్న దానిపై అధిష్టానం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. వాణి విశ్వనాథ్ ను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనే ఇప్పటి వరకూ చంద్రబాబు ఆలోచనగా ఉందని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఈరోజు వాణి విశ్వనాథ్ చంద్రబాబును కలవనుండటంతో నగరి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి.

Similar News