వాక్ విత్ జగన్ అందుకేనా ...?

Update: 2018-01-29 05:30 GMT

వైసిపి అధినేత జగన్ 72 రోజులుగా పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. ఆయన యాత్ర ఈనెల 29 వ తేదికి 1000 కిలోమీటర్ల మైలు రాయికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో వాక్ విత్ జగన్ అన్న కార్యక్రమాన్ని డిజైన్ చేసింది వైసిపి. ఈ కార్యక్రమం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వున్న వైసిపి శ్రేణులన్నీ తమ తమ ప్రాంతాల్లో పాదయాత్రలు చేపట్టి జనంతో మమేకం కావాలి. ఈ కాన్సెప్ట్ తో క్యాడర్ కి పనికల్పించడంతో పాటు జగన్ పాదయాత్ర పై జనం దృష్టి పెట్టేలా చేస్తుందన్నది వైసిపి వ్యూహకర్తలు ఆలోచన.

ఒక్కడిపైనే భారం వేసి ...

పార్టీ అధినేత ఒక్కడై అధికారపక్షంపై ప్రజల్లో వుంటూ పోరాటం సాగిస్తున్నారు. రెండు నెలలు దాటి మూడునెలలు అవుతుండగా వైసిపి క్యాడర్ తమ అధినేత కష్టమే తమను అధికారంలోకి తెస్తోందన్న భరోసా తో చాలా నియోజకవర్గాల్లో చిన్నా చితక కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారు. అంతే తప్ప సీరియస్ గా జనంతో మమేకం అయ్యే లా దూసుకుపోవడం లేదు. దీనిపై అధినేత దృష్టికి ఈ వ్యవహారాలు రావడంతో పాదయాత్రలో ఉండగానే పార్టీ కి పని కల్పించే పనిలో పడ్డారు అధినేత. అందులో భాగంగానే వాక్ విత్ కార్యక్రమానికి వైసిపి వ్యూహకర్తలు ప్లాన్ చేశారు.

ఫేస్ బుక్ లో యాక్టివ్ అయిన జగన్ ...

పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడం లో వైఎస్ జగన్ సామాజిక మాధ్యమాన్ని అస్త్రంగా మలుచుకుంటున్నారు. మెజారిటీ సంప్రదాయ మీడియా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కావడంతో సామాజిక మాధ్యమాలు పార్టీని ప్రజల దగ్గరకు చేరుస్తాయని భావించి తన ఫెస్ బుక్ పేజ్ ను యాక్టివ్ చేశారు ఆయన. విభజన జరిగాక లక్షా 30 వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా వుంటాయని గణాంకాలు చెబుతున్నాయని కానీ వాటి భర్తీకి చంద్రబాబు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యోగాలు భర్తీ చేయాలని తన అభిప్రాయాలను నెటిజెన్స్ తో పంచుకున్నారు జగన్.

Similar News