రాజస్థాన్ సర్కార్ వత్తిడికి వెనక్కి తగ్గింది. ప్రజా ప్రతినిధులకు, జడ్జిలు, ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి విచారణ జరపకూడదని వసుంధరేరాజా కొత్త చట్టాన్ని తీసుకురావాలని తలచారు. అయితే ఈ చట్టాన్ని తేవడానికి ముందు సోమవారం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. బయట నుంచి మేధావి వర్గాలు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అవినీతికి పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులు, జడ్జిలను రక్షించడానికే ఈ బిల్లును తెస్తున్నారన్న విమర్శలు తీవ్రస్థాయిలో విన్పిస్తున్నాయి. ఈ బిల్లుప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులను 180 రోజుల వరకూ విచారించకూడదు. మీడియాలో వారిపై ఎలాంటి వార్తలు రాయకూడదు. ఇదీ ఈ బిల్లు సారాంశం.
సెలెక్ట్ కమిటీకి.....
ఈ బిల్లును తీసుకొచ్చిన రాజస్థాన్ ప్రభుత్వంపై దేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. అవినీతిని పెంచిపోషించడానికే వసుంధర రాజే సర్కార్ ప్రయత్నిస్తుందని పలువురు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వసుంధర రాజే వెనక్కు తగ్గారు. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయకూడదని భావించారు. దీంతో ఈ బిల్లును వసుంధర రాజే సెలెక్ట్ కమిటీకి పంపింది. వచ్చే అసెంబ్లీ నాటికి దీనిపై అభిప్రాయాలు సేకరించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతానికి ఈ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడంతో వివాదం సద్దుమణిగినట్లే. అయితే సెలెక్ట్ కమిటీ ఏ సిఫార్సులు చేస్తుందన్నదీ చూడాలి.