వంశీకి ఏమైంది? ఎందుకిలా?

Update: 2017-11-22 07:30 GMT

వల్లభనేని వంశీ. నిత్యం వివాదాస్పదంగా ఉండే నేత. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆనుకునే ఉన్న గన్నవరం నియోజకవర్గానికి వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ తరచూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుండటంతో అధికార పార్టీకి మింగుడుపడటం లేదు. ఎన్నికల ముందే వంశీ పార్టీలో వివాదం రేపారు. విజయవాడ వచ్చిన వైసీపీ అధినేత జగన్ ను కలిసి కరచాలనం చేయడంతో వంశీ పార్టీలో అప్పట్లో సంచలనం రేపారు. అయితే తాను మర్యాద పూర్వకంగానే జగన్ ను కలిశానని అప్పట్లో వంశీ వివరణ ఇచ్చి అధిష్టానాన్ని సంతృప్తిపర్చగలిగారు. ఇక వంశీ ఎమ్మెల్యేగా అయినా ఆయన ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

నిత్యం వివాదాల్లో....

పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నిత్యం ఏదో ఒక కార్యక్రమాలను చేస్తూనే ఉంటారు. ఇటీవల ప్రభుత్వంపై విసుగు చెంది తన గన్ మెన్లను వెనక్కు పంపి ఎమ్మల్యే వంశీ తన నిరసనను వ్యక్తం చేశారు. దీంతో లోకేష్ వంశీని పిలిచి బుజ్జగించారు. తనకు పోలీసు అధికారి సీతారామాంజనేయుల నుంచి ప్రాణహాని ఉందని, ఎన్నిసార్లు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా తన మాట వినడం లేదని, తన భద్రతను పట్టించుకోవడం లేదన్నది వంశీ వాదన. దీంతో తన గన్ మెన్లను వెనక్కు పంపి ప్రభుత్వంపైనే నిరసన వ్యక్తం చేశారు. తాజాగా డెల్టా షుగర్స్ ను హనుమాన్ జంక్షన్ నుంచి తణుకు తరలించేందుకు వంశీ అంగీకరించడం లేదు. ఈ ఫ్యాక్టరీపై వేలాదిమంది రైతలు, కార్మికులు ఆధారపడి ఉన్నారని తరలించవద్దని కొన్నాళ్లుగా సూచిస్తున్నారు. కాని అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ దొరకడం లేదు. ముఖ్యమంత్రిని కలిసి డెల్టా షుగర్స్ పై తన అభిప్రాయాన్ని తెలియజెప్పాలనుకున్న వంశీని సీఎంవో అధికారులు అడ్డుకున్నారు. లెక్క చేయని విధంగా మాట్లాడారు. దీంతో వంశీ రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే రాజీనామా వంశీ చేస్తారా? లేదా? అన్నది పెద్ద అంశం కాకపోయినా... వంశీ మాత్రం తన అసంతృప్తిని ఏదో ఒకరూపంలో ప్రభుత్వంపై వెళ్లగక్కుతుండటం అధికార పార్టీకి మింగుడుపడటం లేదు.

Similar News