జగన్ పాదయాత్రలో చాలా విశేషాలున్నాయి. బయటకు చెప్పుకోలేని బాధలున్నాయి. జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రతిరోజూ రెండు శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక శిబిరం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆగేందుకైతే, మరొక శిబిరం రాత్రి బస కోసం. ఇలా దాదాపు రోజుకు రెండు శిబిరాలను వైసీపీ జగన్ పాదయాత్రలో ఏర్పాటు చేస్తోంది. అయితే ఇందుకు ప్రధాన కారణాలేంటంటే..... పాదయాత్ర తొలినాళ్లలో రాత్రి బస చేసేందుకే శిబిరం ఏర్పాటు చేసేవారు. మధ్యాహ్న భోజన విరామానికి జగన్ ఆగిన చోట చిన్నపాటి ఏర్పాట్లు చేసేవారు. అయితే కాళ్లకు పుండ్లు పడటంతో మధ్యాహ్నం ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది.
రోజుకు రెండు శిబిరాలు....
అందుకోసమే జగన్ పాదయాత్రకు ప్రతి రోజూ రెండు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాల్లో ప్రత్యేకంగా జగన్ విశ్రాంతి తీసుకునేందుకు ఒక గది, మరొకటి భోజనాల గది, ఇంకొకటి పార్టీ ముఖ్యనేతలు విశ్రాంతి తీసుకునేందుకు. ఇక నేతలతో సమావేశాలుంటే సమావేశ గదిని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జగన్ అరికాళ్ల బొబ్బలు తగ్గకపోవడంతో బ్యాండేజీ వేసుకుని షూ పట్టుమీద నడుస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం భోజన విరామానికి ఆగినప్పుడు కాళ్ల బ్యాండేజీలు మార్చాల్సి ఉంటుంది. అలాగే రాత్రికి కూడా. కాని కాళ్ల నొప్పులు విపరీతంగా బాధపెడుతున్నా జగన్ మాత్రం తన యాత్రను మాత్రం మొండిగా కొనసాగిస్తున్నారు.
వందరోజుల పండగ.....
మరోవైపు ఎండలు ముదిరిపోయాయి. ఇప్పుడే భానుడి భగభగలు ఉదయం 9గంటల నుంచే ప్రారంభమవుతున్నాయి. ఎండ వేడిమిని కూడా లెక్క చేయకుండా జగన్ నడుస్తున్నారు. ఆయన వెంట నేతలు, కార్యకర్తలు కూడా పరుగులు తీస్తున్నారు. వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు శతదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఇక జగన్ పాదయాత్రచేస్తున్న ప్రకాశం జిల్లాలో అయితే ఇరవై కిలోమీటర్ల మేరకు రెండు వేల ఫ్లెక్సీలను కట్టారు. పెద్ద కేకును కట్ చేశారు. వంద అడుగుల పార్టీ జెండాను ఆవిష్కరించారు. మొత్తం మీద జగన్ పంటి బిగువున నొప్పులు భరిస్తూనే పాదయాత్ర చేస్తున్నారు.