రాజకీయాల్లో కేడర్ బలంగా ఉంటేనే నాయకులు బలంగా ఎదుగుతారు. ఏ మాత్రం తేడా వచ్చినా నాయకుల పని గల్లంతే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టీడీపీకి ముఖ్యంగా తెలంగాణ టీడీపీకి చక్కగా నప్పుతాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు అనుకున్నారు. వాస్తవానికి టీడీపీ పుట్టుకే తెలంగాణలో అని నేతలు సహా, పార్టీ అధినేత చంద్రబాబు అనేక సార్లు వెల్లడించారు. అలాంటి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం అంటేనే అక్కడ బలంలేనట్టని అర్ధం వస్తోంది. అలాంటి పార్టీని బలోపేతం చేయాల్సిన దశలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు తెలంగాణలో టీడీపి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఓటుకు నోటు కేసు అనంతరం....
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వెలుగు చూసిన 'ఓటుకు నోటు ' కేసు అనంతరం చంద్రబాబు ఏపీకే పరిమితం కావడం ఒక కారణమైతే.. అక్కడ పార్టీకి ఒక పెద్ద దిక్కు అంటూ ఎవరినీ పెంచి పోషించకపోవడం రెండో కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు కారణాలు తెలంగాణ టీడీపీని అనివార్యమైన పరిస్థితిలో దిక్కుమొక్కు లేకుండా చేశాయని అంటున్నారు పరిశీలకులు. ఒకప్పుడు పార్టీకి ఎంతో బలాన్నిచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్, రేవంత్ రెడ్డి వంటి కీలక నేతలు ఒకరి వెంట ఒకరు పార్టీని వీడిపోగా.. ఉన్న ఒకరిద్దరిని కూడా కాపాడుకోలేని స్థితిలో టీడీపీ ఉందని విమర్శలు పేర్కొన్నారు. అయితే, దీనిపై ఎలాంటి ముందు చూపూ లేకుండా టీ డీపీ అదినేత చంద్రబాబు వ్యవహరిస్తారని అనుకోలేం.
లెక్కలు వేస్తూ...తీస్తూ....
కానీ, ఆయన మాత్రం మౌనంగానే ఉండిపోయారు. ఎంత మంది పోతున్నా. చూస్తూ లెక్కలు వేస్తూ.. తీస్తూ.. ఉన్నవారే ఎక్కవ అనేధోరణిని అవలంబించారు. తాజాగా.. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన నల్లగొండ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా బాబుపై తిరుగుబావుటాకు దాదాపు సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే బాబు.. తనకు తండ్రి లాంటి వాడని తిరుపతి మహానాడులో కన్నీటి పర్యంతమైన మోత్కుపల్లి.. టీడీపీని టీఆర్ ఎస్‌లో విలీనం చేయడం మంచిదని అనడం టీడీపీలో అణుబాంబు ను పేల్చినంత పని చేసింది. అంతేకాదు. . ప్రస్తుతం పార్టీకి కేడర్ కూడా లేకపోవడంపైనా మోత్కుపల్లి విమర్శలు సంధించారు. అయితే, దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేశ్.. మాత్రం.. టీడీపీ తెలంగాణలో వెలిగిపోతోందని అన్నారు. కేడర్ బలంగా ఉందని చెప్పారు.
జెండా పట్టుకునే వారేరీ?
దీంతో లోకేష్ వ్యాఖ్యలపై సర్వత్రా నవ్వులు చిందడం విశేషం. ఒక పక్క జెండా పట్టుకునే నాథుడు లేక నేతలు పలాయనం చిత్తగిస్తుంటే.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి వచ్చినా రావచ్చనే ధోరణితో లోకేష్ మాట్లాడడం ఈ ఏడాది జోక్‌గా అభివర్ణిస్తున్నారు విపక్షాల నేతలు.ఇక, కేడర్ నుంచే నేతలను తయారు చేస్తామని చెప్పడం కూడా లోకేష్ మిగిలిన నేతలకు కూడా వెళ్తే వెళ్లండి.. అని పచ్చజెండా ఊపేసినట్టుగా భావిస్తున్నారు. ఈ పరిణామం పార్టీకి మేలు చేయకపోగా.. మిగిలిన నేతలు సైతం తమ దారి తాము చూసుకునేందుకు అవకాశం ఇచ్చినట్టుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా.. లోకేష్ వ్యాఖ్యలు మంటపై కిరోసిన్ జల్లినట్టుగా ఉందని చెబుతున్నారు.