లేట్ గా వచ్చినా...లేటెస్ట్ గా...!

Update: 2017-12-26 17:30 GMT

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం దాదాపుగా ఖరారయిపోయింది. ఈనెల 31వతేదీన ఆయన అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకూ నానుస్తూ వచ్చిన తలైవా ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ఈ నెల31వ తేదీన ప్రకటిస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రజనీకాంత్ ఒక స్పష్టతతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు భావిస్తున్నారు. ముందుగా అభిమానుల సమావేశాలను ఏర్పాటు చేసి వారి మద్దతుతోనే రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు ఈనెల 31వ తేదీన సంకేతాలు ఇవ్వనున్నారు.

రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనే...

రజనీకాంత్ వచ్చే ఏడాది కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అయితే 2019 లో జరిగే లోక్ సభలో రజనీ పార్టీ ఎన్నికల బరిలోకి దిగే అవకాశం లేదు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులే అభిమానులతో చెబుతున్నారు. తమిళనాడు లో 2021లో జరిగే ఎన్నికల్లోనే బరిలోకి దిగాలన్నది రజనీ ఆలోచనగా ఉంది. మధ్యలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితులతో కూడా చర్చించినట్లు చెబుతున్నారు.

ఎవరితో పొత్తు లేకుండానే...

ఇక రజనీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. తమిళనాడు ఎన్నికల్లో ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే మాత్రమే తలపడుతున్నాయి. కమల్ కొత్త పార్టీ మరొకటి ముందుకు రానుంది. జాతీయ పార్టీలను అంటరానివిగా చూసే తమిళప్రజలకు వాటితో పొత్తు పెట్టుకుని రజనీ దూరం కాలేడు. అలాగే తమిళనాడులో ఇప్పటికే ఉన్న పార్టీలతో పొత్తు ప్రసక్తే ఉండదు. దీంతో తలైవా ఒంటరిపోరాటమే చేయనున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయవచ్చన్నది రజనీ వ్యూహంగా కన్పిస్తోంది. మొత్తం మీద రజనీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడన్నది అసలు విషయం.

Similar News