పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ పనిని ప్రారంభించింది. లోక్ సత్తా అద్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయి ఏపీ లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. ఇప్పటి వరకూ ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత? ఎంత ఖర్చు పెట్టారు? కేంద్రం కేటాయించిన పద్దులకే ఆ నిధులను వినియోగించారా? వంటి అంశాలను ఇద్దరూ పరిశీలించారు. అయితే ఈ లెక్కలు తేల్చేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే కేంద్రం ఇచ్చిన నిధులపై టీడీపీ, బీజేపీలను సమాచారాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. అవి వచ్చిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
తమ వద్ద ఉన్న సమాచారం మేరకు....
అయితే ప్రస్తుతం జయప్రకాశ్ నారాయణ వద్ద కొంత సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకు విభజన హామీలు ఏ మేరకు అమలయ్యాయో జేపీ, ఉండవల్లి చర్చించారు. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్, దుగరాజు పట్నం వంటి విషయాల్లో ఉన్న ఇబ్బందులను కూడా చర్చించారు. ఇక రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులు కేంద్రం ఇచ్చిందెంత? ఖర్చు చేసిందెంత? అన్నది కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినా తాత్కాలిక నిర్మాణాలకే ఆ నిధులు వినియోగించారన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఇప్పటి వరకూ డిజైన్టు కూడా ఖరారు కాకపోవడంపైన కూడా చర్చ జరిగింది.
ఆర్భాటపు ప్రకటనలే తప్ప....
లోక్ సత్తాఅధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాత్రం ప్రచార ఆర్భాటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువగా ఉందని, ఆచరణలో మాత్రం ఏమీ జరగలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి వచ్చని నిధులు, వ్యయంపై నిపుణులతో కూడా చర్చించాల్సిన అవసరం ఉందని జేపీ, ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పార్టీలతో సంబంధం లేకుండా ఏపీ ప్రజలకు మేలు జరగాలన్నదే తమ లక్ష్యమని వారు వివరించారు. ఇప్పటికే నాలుగేళ్లు పూర్తయిందని, అనేక చిక్కుముడులున్నాయని వారు అభిప్రాయపడ్డారు. తమకు చిత్తశుద్ధి ఉందని, బలం లేదని జేపీ వ్యాఖ్యానించారు. ఒక మంత్రి తనది ధృతరాష్ట్ర కౌగిలితో పోల్చడంపై ఉండవల్లి స్పందించారు. ధృతరాష్ట్ర కౌగిలి నుంచి కూడా తప్పించుకోవచ్చని, పవన్ శ్రీకృష్ణుడు లాంటి వాడని, తప్పించుకుంటాడని వ్యంగ్యంగా ఉండవల్లి అన్నారు. మొత్తం మీద జేఎఫ్ సి తన పనిని ప్రారంభించింది.