లీడర్లతో జగన్ ఫుల్ సిట్టింగ్

Update: 2017-10-10 05:30 GMT

పాదయాత్రే తనకు అధికారం తెచ్చిపెట్టనుందని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి పాదయాత్ర వెళ్లేలా ఆయన కసరత్తులు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొన్ని మార్పులు, చేర్పులు కూడా సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాదయాత్ర టీడీపీకి బలమైన ప్రాంతాల్లో ఎక్కువ రోజులు కొనసాగేలా చూడాలని వైసీపీ నేతలను జగన్ కోరారు. ఆ మేరకే వారు రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. అంతేకాకుండా వైసీపీ నుంచి టీడీపీకి మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర ప్రతి మండల కేంద్రాన్ని టచ్ చేసేలా చూడాలని జగన్ ఆదేశించారు. దీంతో ఆ మేరకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసిన వైసీపీ నేతలు దానిని జగన్ ముందుంచారు.

పాదయాత్ర పార్టీ భవిష్యత్ పై చర్చ.....

వచ్చేనెల రెండో తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. తొలుత కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేపడతానని జగన్ ప్రకటించారు. కాని తిరుపతి నుంచి ప్రారంభిస్తే శుభం జరుగుతుందని కొందరు సూచించడంతో ఈ మేరకు జగన్ పునరాలోచనలో పడ్డారు. నవంబరు 2వ తేదీన పాదయాత్ర ప్రారంభమవుతుంది. అయితే ఎక్కడి నుంచి అన్నది మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. దీనిపై బుధవారం జగన్ పాదయాత్ర పై ప్రత్యేక సమావేశాన్ని పెట్టారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులందరూ హాజరుకావాలని వైసీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ సమావేశంలోనే పాదయాత్ర ఎక్కడి నుంచి చేపట్టాలి? రూట్ మ్యాప్ లో మార్పులు,చేర్పులపై కూడా జగన్ నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో వారికి అన్నీ తెలుసుకాబట్టి వారి నుంచే వివరాలు తెలుసుకోవాలని జగన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు పార్టీ భవిష్యత్ పైన కూడా చర్చించనున్నారు. ఇప్పటి వరకూ కొందరు ముఖ్య నేతలతో మాత్రమే సమావేశాలు నిర్వహించే జగన్ ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Similar News