తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. వరుసగా రెండు రోజుల పాటు టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయి వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడమే లక్ష్యంగా కార్యక్రమాలను రూపొందించుకోవాలని ఆదేశించారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమైన చంద్రబాబు గురువారం తన నివాసంలో టీటీడీపీ నేతలతో భేటీ అయ్యారు. పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తెలంగాణలో మార్చి 29వ తేదీ వరకూ కొనసాగించాలని చెప్పారు.
జిల్లాలు పర్యటించండి....
అలాగే రాష్ట్ర స్థాయి నేతలందరూ అన్ని జిల్లాలు పర్యటించి క్యాడర్ లో జోష్ నింపాలన్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండబోదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలోనే ఎవరితో పొత్తు ఉండాలో తాను నిర్ణయిస్తానని, అప్పటి వరకూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. మే నెలలో జరగనున్న మహానాడులోపు మూడు భారీ బహిరంగసభలను తెలంగాణలో నిర్వహించాలన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు నేతలతో టచ్ లోనే ఉంటానని, అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పారు.
బలంగా ఉంటేనే పొత్తుకు.....
పార్టీ బలంగా ఉందని తెలిస్తేనే పొత్తుకు ఎవరైనా ముందుకు వస్తారని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ నుంచి నేతలు ఎంతమంది వెళ్లినా అధైర్య పడవద్దని, కార్యకర్తలను మాత్రం వదులుకోవద్దని సూచించారు. అంతేకాకుండా ఎవరైనా పార్టీ వీడిన నేతలు పార్టీలోకి తిరిగి వస్తామంటే చేర్చుకోవాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. మే నెలాఖరుకు పార్టీ కమిటీలన్నింటినీ పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. త్వరలో ఖమ్మంలో జరగనున్న సమావేశానికి తాను హాజరవుతానని కూడా చంద్రబాబు నేతలకు హామీ ఇచ్చారు. టీడీపీని ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తి లేదని, ఆ ఊహాగానాలను నేతలే ఖండించాలని చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాడితేనే పార్టీ తిరిగి పుంజుకుంటుందని ఉద్భోధించారు.