లాలూ యాదవ్ భవితవ్యం మరికాసేపట్లో తేలిపోనుంది. 1996లో వెలుగు చూసిన పశు దాణా కుంభకోణం కేసులో రాంచీ కోర్టు మరికాసేపట్లో తీర్పు నివ్వనుంది. ఈ కేసు నుంచి లాలూ నిర్దోషిగా బయటపడతారా? లేక జైలు వెళతారా? అన్నది మారికాసేపట్లో తేలనుంది. లాలూ ప్రసాద్ యాదవ్ ఈకేసులో పీకల్లోతు కూరుకుపోయారు. బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 1996లో పశుదాణా కుంభకోణానికి పాల్పడినట్లు బయటపడింది.
1996లో వెలుగులోకి...
దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది. 84.5 లక్షల రూపాయల విలువైన ఈ కుంభకోణంలో లాలూతో పాటు మరో 34 మందిపై సీబీఐ 1997లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. లాలూతో పాటు ఆర్జేడీ మరో నేత జగన్నాధమిశ్రా పేరు కూడా ఉంది. అయితే ఈ 34 మందిలో ఇప్పటికి 11 మంది చనిపోయారు. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ కేసులో ముగ్గురు అప్రూవర్లగా మారిపోయారు.
తమకు అనుకూలంగానే....
అయితే లాలూ కుటుంబం మాత్రం ఈ తీర్పులో లాలూ నిర్దోషిగా బయటపడతారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. తీర్పు ఎలా ఉన్నప్పటికీ ఆర్జేడీ కార్యకర్తలు సంయమనం పాటించాలని లాలూ ప్రసాద్ యాదవ్ కోరారు. 2జీ స్పెక్ట్రమ్, ఆదర్శ్ కుంభకోణంలాగానే ఈ కేసులో కూడా తాము నిర్దోషులుగా బయటపడతామని లాలూ కుటుంబం చెబుతోంది. మొత్తం మీద దాణా కుంభకోణం కేసులో మరికాసేపట్లో తీర్పు రానున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.