బీహార్ లో అధికార జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత తనకు హ్యాండ్ ఇచ్చి కమలనాధులతో అతుక్కుపోయిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అంటేనే ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడుతున్నారు. ఏ చిన్న అవకాశం చిక్కినా లాలూ ట్విట్టర్లో ఉతికి పారేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా మోడీ పార్టీని తిట్టి దానితోనే అంటకాగిన నితీష్ ను అస్సలు లాలూ వదలిపెట్టడం లేదు. బీహార్ లోని పాట్నాలో మరుగుదొడ్ల పేరుతో 13.50 కోట్ల కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణాన్ని మీడియా బయటపెట్టడంతో లాలూ దానిని అందిపుచ్చుకున్నారు.
ముదిరిన మాటల యుద్ధం.....
దీనికి లాలూ తీవ్రంగా స్పందించారు. తాను పశుదాణా కుంభకోణం కేసులో ఇరుక్కున్నప్పుడు గడ్డితిన్నారని విమర్శించిన నేతలు ఇప్పుడు ఏం తిన్నారని? మరుగుదొడ్ల కుంభకోణంపై తీవ్రంగా ప్రశ్నించారు. నితీష్ కుమార్ ఎప్పుడైనా కుంభకోణాల్లో ఇరుక్కునే అవకాశముందని లాలూ యాదవ్ ట్విటర్లో ధ్వజమెత్తారు. మరోవైపు ఆర్జేడీ, జేడీయూల మధ్య ఫొటోల వివాదం కూడా జరుగుతోంది. లాలూ తనయుడు తేజస్వీయాదవ్ ఓ యువతితో ఉన్న ఫొటోలను జేడీయూ విడుదల చేసింది. అయితే ఆ ఫొటో తనది కాదని 2010 నాటిదని తేజస్వి యాదవ్ చెబుతున్నారు. అది ఐపీఎల్ వేడుకల్లో దిగిన ఫొటో అని తేజస్వీ వివరణ ఇచ్చారు. దీనికి ప్రతిగా నితీష్ కుమార్ వివాదాస్పద వ్యక్తితో ఉన్న ఫొటోను ఆర్జేడీ రిలీజ్ చేసింది. లిక్కిర్ మాఫియాతో జేడీయూ నేతలు అంటకాగుతున్నారని ఆర్జేడీ ధ్వజమెత్తింది.మొత్తం మీద పాత మిత్రుల మధ్య శత్రుత్వం మరింత పెరిగింది.