టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంట ఎవరెవరు వెళతారోస్పష్టంగా తెలియకపోయినా... ఈనేత మాత్రం రేవంత్ రెడ్డి వెంటనే వెళ్లే అవకాశాలున్నాయి. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెర్వు నియోజకవర్గంలో ఈ నేతకు వచ్చే ఎన్నికల్లో సీటు కూడా ఖరారయిందనిచెబుతున్నారు. ఇక్కడ పెద్దగా నేతలు లేకపోవడంతో కాంగ్రెస్ బీఫారం ఇతనికే దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పఠాన్ చెర్వు నియోజకవర్గం అంటే సిటీలోనేదాదాపు ఉంటుంది. కాంగ్రెస్ కు ఇక్కడ పట్టుంది. అయితే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ వీడి కమలనాధుల చెంతకు చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తుండటంతో ఆయన రాహుల్ కు ఇచ్చిన జాబితాలో పఠాన్ చెర్వు నియోజకవర్గానికి ఒక నేత పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఆ నేతకు సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ కు కూడా పెద్దగా ఇబ్బందులుండవు.
టీఆర్ఎస్ గాలిలోనూ గెలిచిన.....
పఠాన్ చెర్వు నియోజకవర్గం అంటేనే... ఎక్కువగా పరిశ్రమలున్న ప్రాంతం. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ వెళ్లిపోయిన తర్వాత చిన్నా చితకా నేతలు కొందరు నాయకత్వం కోసం గాంధీ భవన్ చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు. కాని రేవంత్ కు అనుంగు శిష్యుడిగా పేరొందని పఠాన్ చెర్వు జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ పేరు ఇప్పుడు కాంగ్రెస్ లో బలంగా విన్పిస్తోంది. శ్రీకాంత్ గౌడ్ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు. గతంలో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలి బలంగా వీస్తున్నప్పటికీ శ్రీకాంత్ గౌడ్ టీడీపీ గుర్తుపైన జడ్పీటీసీగా గెలిచారు. అంతేకాకుండా శ్రీకాంత్ గౌడ్ కార్మికనేత కూడా కావడం కలిసొచ్చే అంశమంటున్నారు. రేవంత్ రెడ్డి తో పాటు శ్రీకాంత్ గౌడ్ కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయమయిపోయింది. అదే సమయంలో టిక్కెట్ కూడా కన్ఫర్మ్ అయిందంటున్నారు ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు. కాని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ పెద్దగా లేకపోవడంతో బిఫారం సులువుగా శ్రీకాంత్ కు దక్కుతుందంటున్నారు.