వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అయినా రేవంత్ వెంట వెళ్లారు. కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి జరిగే అవకాశం ఉంది. టీడీపీని వదిలి రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్ వెంట మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డి, బోడ జనార్థన్, సోయం బాపూరావు తదితరులు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అగ్ర నాయకులతో పాటుగా కొందరు చోటా మోటా నేతలు కూడా రేవంత్ వెంట వెళ్లే వారిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారు, నియోజకవర్గాలకు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారు కూడా రేవంత్ కు జై కొట్టారు. వీరిలో సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెర్వులో మాత్రం వర్గ పోరు మొదలయిందనే చెప్పాలి.
ఇక్కడ కూడా విభేదాలేనా?
పటాన్ చెర్వులో రేవంత్ రెడ్డి వెంట పటాన్ చెర్వు జడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్ గౌడ్ వెళ్లారు. ఆయన పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తమకు అభ్యర్థి దొరికాడని సంబర పడింది. పటాన్ చెర్వుకు కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరడంతో కాంగ్రెస్ కూడా అక్కడ నాయకుడి కోసం అన్వేషిస్తుంది. రాహుల్ కు రేవంత్ ఇచ్చిన జాబితాలో శ్రీకాంత్ గౌడ్ పేరు కూడా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో శ్రీకాంత్ గౌడ్ కే టిక్కెట్ ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే నిన్న సంగారెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న శశికళ యాదవ్ రెడ్డి కూడా రేవంత్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. ఆమె టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ తరుణంలో మళ్లీ అక్కడ వర్గపోరు మొదలయ్యే అవకాశముంది. శశికళకు, శ్రీకాంత్ గౌడ్ కు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నప్పుడే విభేదాలున్నాయి. ఇద్దరు నేతలు ఎడమొహం... పెడమొహంగానే ఉంటారు. వీరిద్దరూ తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో ఆ నియోజకవర్గం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారుతుందని భావిస్తున్నారు. ఇద్దరూ పటాన్ చెర్వు టిక్కెట్ కోసమే ప్రయత్నిస్తున్నారు. మరి రేవంత్ వీరిలో ఎవరికి న్యాయంచేస్తారో... కాంగ్రెస్ మార్కు డెసిషన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.