రేవంత్ రెడ్డి టీడీపీని వీడి ఒంటరిగా వీడి వెళ్లడం లేదు. కొందరు నేతలతో సహా పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా యువనేతలు రేవంత్ రెడ్డి వెంట ఉన్నట్లు సమాచారం. తెలంగాణ టీడీపీలో ఉన్న యువనేతలు రేవంత్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. అందుకే రేవంత్ వెంట వారు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిన సమయంలో తన వెంట వచ్చే నేతలకు కూడా టిక్కెట్లు ఇచ్చే విషయంపై ఒక క్లారిటీ తీసుకున్నారట. దాదాపు 12 శాసనసభ నియోజకవర్గాలకు తన వెంట వచ్చే నేతలకు సూచించారట. అయితే రాహుల్ రేవంత్ కు స్పష్టమైన హామీ ఇవ్వకపోయినప్పటికీ వెంట వచ్చేవారందరికీ న్యాయం జరుగుతుందని రాహుల్ నుంచి హామీ లభించిందని చెబుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలందరూ రేవంత్ వెంట లేకపోవడం గమనార్హం. అందరూ యువనేతలే రేవంత్ వెంట ఉన్నారు.
యువనేతలను తీసుకుని.....
ముఖ్యంగా మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి రేవంత్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు ముఖ్యనేతలు కూడా రేవంత్ వెంట నడిచే అవకాశముంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ కు స్పష్టమైన హామీ లభించిందని వీరు తమ సన్నిహితులకు ఫోన్ ద్వారా చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద రేవంత్ ఒక్కడే కాకుండా తన వెంట గెలుపు గుర్రాలను పక్కన పెట్టుకుని పోతున్నట్లు చెబుతున్నారు. వారి కుటుంబానికి ఉన్న చరిత్రతో పాటు, వారికి టిక్కెట్లు ఇస్తే గెలుపు ఎలా సాధ్యమవుతుందో లెక్కలు కట్టి మరీ రేవంత్ చెప్పారట. మొత్తం మీద రేవంత్ పార్టీని వీడుతుండటంపై తెలంగాణ తెలుగుదేశంపార్టీ నేతలు పైకి ఏం కాదులే అంటున్నా లోలోపల మాత్రం డీలా పడిపోయారు.