రేవంత్ ‘లోకల్’ ప్లాన్ ఫలించిందే?

Update: 2017-12-28 05:30 GMT

రేవంత్ వేసిన ప్లాన్ పక్కాగా ఫలించింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో అప్పడే రాజకీయాలు వేడెక్కాయి. జడ్చర్లలో కాంగ్రెస్ సభ ఊహించని విధంగా విజయవంతం కావడంతో అన్ని పార్టీలూ నియోజకవర్గంపై దృష్టిపెట్టాయి. ఇందులో రేవంత్ ప్లాన్ ఏంటంటే...వచ్చే ఎన్నికల్లో తాను జడ్చర్ల నుంచి పోటీ చేస్తానని రేవంత్ ఫిల్లర్ వదిలారు. ఇది వైరల్ అయింది. దీంతో పాటు జడ్చర్లలో జరిగిన బహిరంగ సభలో అధికార టీఆర్ఎస్ తో పాటు మంత్రి లక్ష్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. లక్ష్మారెడ్డి అసలు డాక్టరే కాదని, ఆయన డాక్టర్ అని చెప్పుకుని తిరుగుతున్నారని రేవంత్ ఆరోపించారు.

లోకల్ వివాదం రచ్చ అయిందే...?

దీంతో రేవంత్ జడ్చర్లలో పోటీ చేస్తానని భావించిన మంత్రి లక్ష్మారెడ్డి కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. స్థానికులకే జడ్చర్ల ప్రజలు పట్టం కడతారని, స్థానికేతరులను తిప్పి పంపాలని పిలుపునిచ్చారు. అయితే వాస్తవానికి రేవంత్ కొడంగల్ నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదు. ఈ విషయాన్ని ఆయన అనేకసార్లు స్పష్టం చేశారు. లక్ష్మారెడ్డి చేసిన ‘లోకల్’ నినాదాన్ని రేవంత్ అందిపుచ్చుకున్నారు. జడ్చర్లలో వచ్చే ఎన్నికల్లో మల్లు రవి నిలబడటం దాదాపు ఖాయమైపోయింది. మల్లు రవి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన నాగర్ కర్నూలు ఎంపీగా వెళతారన్నది అవాస్తమని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. జడ్చర్ల సభ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

మంత్రి లక్ష్మారెడ్డికి బూమ్ రాంగ్....

కాని ఇప్పుడు మంత్రి లక్ష్మారెడ్డి తాను చేసిన కామెంట్ తన మెడకు చుట్టుకున్నట్లయింది. ఎందుకంటే జిల్లాల విభజన జరిగిన తర్వాత ఆయన సొంత గ్రామమైన తిమ్మాజీ పేట మండలం ఆవంచ గ్రామం నాగర్ కర్నూలు జిల్లాలోకి వెళ్లిపోయింది. అంటే ఇప్పుడు జడ్చర్లకు మంత్రి లక్ష్మారెడ్డి స్థానికేతరుడేనని రేవంత్ రెడ్డి కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. స్థానికేతరులను బయటకు పంపాలన్న మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్లకు స్థానికుడే కాదని రేవంత్ వాదిస్తున్నారు. ఇక్కడ టీడీపీ తరుపున ఎర్ర శేఖర్ బరిలో ఉండనున్నారు. ఆయన కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యలనే ఆయనకు వ్యతిరేకంగా జనంలోకి పంపడంలో రేవంత్ బిజీగా ఉన్నారు. మొత్తం మీద ఎన్నికలకు ముందే జడ్చర్ల రాజకీయంగా వేడెక్కింది.

Similar News