టీటీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టిలో పడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహారం గత కొద్దిరోజులుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, నవంబరు నెలలో రాహుల్ తెలంగాణ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలు విన్పిస్తున్నాయి. శుక్రవారం కూడా రేవంత్ తో పాటు టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. రేవంత్ ను ఆపేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారు. రేవంత్ పై ఆరోపణలు చేస్తున్న మోత్కుపల్లి, అరవిందకుమార్ లను నిలువరించారు. ఈరోజు మధ్యాహ్నం కూడా రేవంత్ బెజవాడ వెళ్లారు. అసలు అమరావతికి రేవంత్ ను టీటీడీపీ నేతలను చంద్రబాబు రమ్మనడానికి కారణం కూడా అదే. రేవంత్ వ్యవహారాన్ని చక్కదిద్దాలన్నది చంద్రబాబు ప్రయత్నం. రేవంత్ వ్యవహారం బీజేపీ జాతీయ అధ్యక్షుడికి కూడా తెలియడంతో ఆయన నేరుగా చంద్రబాబుకు ఫోన్ చేసి ఆరా తీశారు. రేవంత్ ను ఎలాగైనా పార్టీలో ఉండేలా చూడాలని, కాంగ్రెస్ లోకి వెళ్లనివ్వవద్దని చంద్రబాబును అమిత్ షా కోరినట్లు తెలిసింది. పొత్తుల గురించి తర్వాత మాట్లాడుకుందామని అమిత్ షా చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. అయితే రేవంత్ అప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోవడానికి డిసైడ్ అయిపోయారని, తానేమీ చేయలేని పరిస్థితి అని చంద్రబాబు అమిత్ షాకు చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేవంత్ లాంటి నేతను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీని వీడకుండా చూడమన్నారంటే రేవంత్ పై ఫీడ్ బ్యాక్ ఎలా ఉందో చెప్పకనే తెలుస్తోంది.